పెద్దాపురంలో టీడీపీ తరపున వరసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో హోంమంత్రిగా పనిచేశారాయ. చినరాజప్ప సొంతూరు అమలాపురంలో ఉంటుంది. అయితే అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కావడంతో… 2014 ఎన్నికల్లో తొలిసారి పెద్దాపురం బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి 1994,1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బొడ్డు భాస్కర రామారావు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బొడ్డు ఫామిలీ సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి చేరిపోయింది. 2014 ఎన్నికల్లో బొడ్డు భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకట రమణ రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
2014 ఎన్నికల తర్వాత బొడ్డు ఫ్యామిలీ వైసీపీకి దూరమైంది. భాస్కర రామారావు టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప బొడ్డు రాకను వ్యతిరేకించారు. తన సీటుకు ఎక్కడ ఎసరొస్తుందో అని అధినేత దగ్గర ఆయన అన్ని అస్త్రాలు ఉపయోగించారు. ఇలా పార్టీని కాదని వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోవడం వల్ల కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చినరాజప్ప చెప్పినప్పటికీ బొడ్డు రీఎంట్రీకే బాబు మొగ్గు చూపారు. గత ఏడాది భాస్కర రామారావు చనిపోయారు. తండ్రి తర్వాత యాక్టివ్ రోల్ పోషించాలని చూస్తోన్న ఆయన తనయుడు వెంకట రమణ టీడీపీ కండువా కప్పుకోవడానికి ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారట. మరోసారి చినరాజప్ప అడ్డుకున్నట్టు సమాచారం.
వెంకట రమణ ఎంట్రీని చిన రాజప్ప వ్యతిరేకించడంతో.. ఆయన తమ కుటుంబంతో ముందు నుంచి సన్నిహితంగా ఉంటోన్న యనమల ద్వారా నరుక్కొచ్చారట. చంద్రబాబు దగ్గర ఆమోద ముద్ర వేయించారట. ఈ విషయం తెలిసి అవాక్కయ్యారట చినరాజప్ప. గత ప్రభుత్వంలో జిల్లా నుంచి యనమల, చినరాజప్పలు మంత్రులుగా ఉన్నారు. ఆ సమయంలోనూ ఎవరి వర్గం వారిదే. నోటితో నవ్వుకుంటూ నొసటితో వెక్కిరించుకునేవారు. బొడ్డు వెంకట రమణ చేరికలో యనమల పైచెయ్యి సాధించడంతో చినరాజప్ప పూర్తిగా డీలా పడ్డారట.
ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ ఉంది. బొడ్డు వెంకట రమణ చౌదరిని తన దగ్గరకు తీసుకురావాలని చినరాజప్పకు చంద్రబాబుతో చెప్పించారట యనమల. ముందు ససేమిరా అన్నప్పటికీ బాస్ చెప్పడంతో తప్పలేదట. స్వయంగా ఆయన్ను వెంటబెట్టుకుని అధినేత దగ్గరకి తీసుకెళ్లారు. దగ్గరుండి పసుపు కండువా కప్పించారు. అయితే కష్టకాలంలో పార్టీని, కేడర్‌ను వదిలి వెళ్లిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా అని నొచ్చుకున్నారట రాజప్ప. అలాగే పెద్దాపురంలో యనమల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఇదే విధంగా తాను తునిలో వేలు పెడితే ఉరుకుంటారా అని చినరాజప్ప ఫైర్ అవుతున్నారట. మొత్తానికి తాజా చేరికలు పెద్దపురం టీడీపీలో పెద్ద పంచాయితీనే తీసుకొచ్చాయి. రానున్న రోజుల్లో రాజకీయం ఆసక్తిగా మారుతుందని చర్చ సాగుతుంది. మరి ఎవరికి ఎవరు పెద్దాపురంలో చెక్ పెడతారో.. ఏం జరుగుతుందో చూడాలి.