రాజకీయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు ఆ మాజీ మంత్రి..! ఇప్పుడు కుమారుడి పొలిటికల్ ప్యూచర్ కోసం వ్యూహ రచన చేస్తున్నా వర్కవుట్ కావడం లేదట. రూటు మార్చి ప్లాన్ బీ అమలు చేస్తున్నారట. ఇంతకీ ఎవరా సీనియర్ నేత?
మంత్రిగా ఉన్నప్పుడు తన విమర్శలతో టీడీపీని ఇరుకున పెట్టారు..!
విశాఖజిల్లా, నర్సీపట్నం. ఈ పేరు చెబితే పొలిటికల్ సర్కిల్స్‌లో ఠక్కున గుర్తుకొచ్చే పేరు చింతకాయల అయ్యన్నపాత్రుడు. గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే పార్టీలో కొనసాగుతున్న నాయకుడు. ఆరుసార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి. పార్టీలో సీనియర్ నేత కావడంతో అయ్యన్నకు చంద్రబాబు దగ్గర గట్టిపట్టుంది. అధికారంలో ఉన్నా.. విపక్షంలో కొనసాగుతున్నా మాటల తూటాలు పేలుస్తారు. ఈ క్రమంలో ఎదుటిపక్షమైనా ఇరుకున పడుతుంది లేదా ఆయనైనా ఇబ్బందుల్లో పడతారు. మంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ల్యాండ్ స్కాం సహా పలు అంశాల్లో అయ్యన్న వైఖరి టీడీపీని సైతం ఇరుకున పెట్టింది.
కుమారుడు విజయ్‌కు రాజకీయ మైలేజ్ కోసం తాపత్రయం..!
రాజకీయంగా అయ్యన్నపాత్రుడికి జిల్లాలో కొందరితో విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ అయ్యన్న ముక్కుసూటితనానికి హైకమాండ్ తలొగ్గక తప్పలేదు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన ఆయన.. కొంతకాలంగా నర్సీపట్నంపైనే ఫోకస్ పెట్టారు. ఇక్కడ టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ బలమైన ఎత్తులు వేస్తోంది. ఫలితంగా టీడీపీకి వరస పరాజయాలు తప్పడం లేదు. దీంతో మాజీమంత్రి ప్లాన్ బీ అమలు చేస్తున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఎదురుదాడి చేయడం అనే విధానం ద్వారా ప్రజలు, పార్టీ అటెన్షన్ ఎప్పుడూ తన కుటుంబంవైపు ఉండేలా జాగ్రత్త పడుతున్నారని టాక్. ఇందుకు రాజకీయంగా సాధించే మైలేజ్ కంటే పెద్ద కుమారుడు విజయ్‌కు భవిష్యత్ ఇచ్చేందుకు పడుతున్న తాపత్రయమే అసలు కారణం అనేది అంతర్గత సమాచారం.
తండ్రి అనుభవం.. చతురత విజయ్ అందిపుచ్చుకోవడం లేదా?
టీడీపీలో ఐటీ వింగ్ చూస్తున్న విజయ్‌కు చంద్రబాబు, లోకేష్‌ల దగ్గర బాగానే గుర్తింపు ఉంది. అయితే అయ్యన్న తర్వాత ఆయనంత నాయకుడు అనే ముద్ర వేయలేకపోయారు విజయ్. తండ్రి అనుభవం.. చతురతను అందిపుచ్చుకోవాల్సినచోట దూకుడుగా వెళ్తూ వెనక పడుతున్నారన్నది టీడీపీలో అంతర్గత చర్చ. ఈ ప్రచారమే గత ఎన్నికల్లో విజయ్‌కు టికెట్ రాకుండా చేసిందని టాక్. 2019లో అనకాపల్లి లోక్‌సభ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా.. నాటి పరిణామాలు మారిపోవడంతో టీడీపీ అధిష్ఠానం ఒప్పుకోలేదు.
అయ్యన్నకు మైనస్‌గా మారిన కుటుంబ కలహాలు..!
నర్సీపట్నంలో ప్రస్తుతం అయ్యన్నకు ఎదురుగాలి వీస్తోంది. గతంలో అయ్యన్న వ్యవహారాలు చూసుకునే ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు ఎదురు తిరిగారు. వైసీపీలో చేరిపోయారు. అయ్యన్న దగ్గర రాజకీయ ఓనమాలు దిద్దిన ఉమాశంకర్ గణేష్ వైసీపీ ఎమ్మెల్యే. ఇదే సమయంలో మాజీ మంత్రి కుటుంబంలో వచ్చిన కలహాలు రోడ్డుకెక్కాయి కూడా. ఈ టైమే కరెక్ట్ అనుకున్న అధికార వైసీపీ.. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడిని రాజకీయంగా ఓ రేంజ్‌లో కార్నర్ చేస్తోంది. సన్యాసిపాత్రుడు భార్య అనిత ప్రస్తుతం జిల్లా సహకార బ్యాంక్ ఛైర్మన్. వీటన్నంటినీ గమనించిన మాజీ మంత్రి.. సోషల్ మీడియాతోపాటు బహిరంగ వేదికల నుంచి ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. మొన్నటికి మొన్న చంద్రబాబు కుటుంబానికి అవమానం జరిగిందని ఆయన తలపెట్టిన ర్యాలీ రభసకు దారితీసింది. ఆ సందర్భంగా మాజీ మంత్రి చేసిన కామెంట్స్‌కు పోలీసులు కౌంటర్ ఇచ్చారు.
మౌత్ పబ్లిసిటీ ద్వారా అయ్యన్నకు వ్యతిరేకత పెంచే వ్యూహం..!
కేవలం కుమారుడు విజయ్ రాజకీయ భవిష్యత్ కోసమే అయ్యన్నలో బెంగ ఎక్కువైందని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మౌత్ పబ్లిసిటీ ద్వారా మాజీ మంత్రికి వ్యతిరేకత పెంచాలన్న వ్యూహం కనిపిస్తోంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పోటీకి అయ్యన్న పాత్రుడు విముఖత వ్యక్తం చేస్తే టికెట్ విజయ్‌కే దక్కుతుందని టాక్. ఆ కారణమో ఏమో.. ఇప్పటి నుంచే కుమారుడికి లైన్ క్లియర్ చేసేందుకు తండ్రి చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.