ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు మొదలు.. మొన్నటి పంచాయతీ ఎన్నికల వరకు అధికారపార్టీ వైసీపీ విజయఢంకా మోగించింది. రెండు ఎంపీ స్థానాలు.. 14 అసెంబ్లీ, 8 మున్సిపాలిటీలు.. 53 జడ్పీటీసీ, 53 ఎంపీపీ అన్నీ వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. ఇవి కాకుండా ముగ్గురు ఎమ్మెల్సీలు.. మరెన్నో కార్పొరేషన్ల ఛైర్మన్లు.. డైరెక్టర్లు ఎందరో ఉన్నారు. కర్నూలు నగరంలో బలమైన వైసీపీ నేతలకు కొదవ లేదు. ఇంతమంది ఉన్నప్పటికీ సామాజిక న్యాయభేరి పేరిట చేపట్టిన బస్సుయాత్రను లైట్ తీసుకున్నారు. కర్నూలుకు బస్సుయాత్ర రాగానే స్థానిక వైసీపీ నేతలు అదరగొట్టేస్తారని పార్టీ పెద్దలు భావిస్తే.. క్షేత్రస్థాయిలో జరిగింది మరొకటి.
జన సమీకరణపై కర్నూలు జిల్లా వైసీపీ నేతలు ఒక్కరూ శ్రద్ధ తీసుకోలేదు. పైపెచ్చు అంతర్గత కలహాలకే ప్రాధాన్యం ఇచ్చారు నాయకులు. ఆ ఎఫెక్ట్ కర్నూలు బస్సుయాత్రపై కనిపించింది. జనసమీకరణ విషయంలో చేతులు ఎత్తేశారు. కార్యక్రమం పేలవంగా సాగింది. జిల్లాలో మంత్రి.. ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. నంద్యాల, కర్నూలు సభలకు వచ్చిన వారి కంటే మరిన్నిరెట్లు ఎక్కువగా జనాన్ని సమీకరించే సత్తా అక్కడి నాయకులకు ఉంది. చివరకు కీలక సమయంలో హ్యాండ్సప్ అనడంతో వైసీపీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారట. కర్నూలు జిల్లా వైసీపీ నేతలపై కారాలు మిరియాలు నూరుతున్నట్టు సమాచారం.
కార్యక్రమం పేలవంగా సాగడానికి కారణం ఎవరు? ఎందుకిలా జరిగింది అనే అంశాలపై వైసీపీలో చర్చ జరుగుతోందట. లోపం ఎక్కడుంది? ఎవరిది నిర్లక్ష్యమో తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారట వైసీపీ పెద్దలు. పదవుల్లో ఉన్న నాయకులు ఒక్కొక్కరూ వందమందిని తీసుకొచ్చినా నంద్యాల.. కర్నూలులో రోడ్లు కిక్కిరిసి కనిపించేవని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మంత్రి జనాన్ని తీసుకొస్తారని.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యేలే జనాన్ని తరలిస్తారని మంత్రి గుమ్మనూరు జయరాం భావించారట. ఇదే కొంపముంచినట్టు అభిప్రాయపడుతున్నారు.
బస్సుయాత్ర వస్తున్న సమయానికి కొన్ని గంటల ముందు రోడ్లను మూసివేసి.. జనాలు, వాహనాల రాకపోకల్ని అడ్డుకోవడం కూడా జనసమీకరణకు ప్రతికూలంగా మారినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వాస్తవానికి కర్నూలు సీ క్యాంపు ప్రదేశం రద్దీగా ఉంటుంది. అక్కడ యాత్ర రావడానికి 4 గంటలు ముందే రహదారులు మూసివేశారు. దీంతో పార్టీ కార్యకర్తలు సైతం సభకు రాలేకపోయారని తెలుస్తోంది. చివరకు బైక్ ర్యాలీగా వస్తున్న యువకులు సైతం మధ్యలోనే ఆగిపోయారట. వీటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ పార్టీ పెద్దలు తెప్పించుకుంటున్నట్టు సమాచారం. బాధ్యులపై చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మరి.. తాడేపల్లి నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుందో చూడాలి.