Amith Shah and Jr.NTR Meeting : అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ చుట్టూనే ప్రస్తుతం రాజకీయ చర్చలు తిరుగుతున్నాయి. మునుగోడు సభ కోసం వచ్చిన బీజేపీ అగ్రనేత.. ఎందుకు హీరోతో సమావేశం అయ్యారు? ఈ మీటింగ్ వెనక రాజకీయ వ్యూహం ఏంటి? అమిత్ షా ఆఫర్‌కు ఎన్టీఆర్ ఎలా స్పందించారు? రామబాణం బీజేపీకి కలిసి వస్తుందా? లెట్స్ వాచ్..!
అధికారంలోకి రావడానికి.. లేదా అధికారం నిలుపుకోవడానికి రాజకీయ పార్టీలు అనేక ఎత్తులు వేస్తాయి. అనూహ్య సమీకరణాలు తెరమీదకు వస్తాయి. ఎవరు ఎప్పుడు ఏ శిబిరంలో ఉంటారో చెప్పలేం. తాజాగా కేంద్ర హోంమంత్రి.. బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన అలాంటి చర్చకే వేదికైంది. మునుగోడు సభ కోసం రాష్ట్రానికి వచ్చిన షా.. రైతులతో భేటీ అయ్యారు. బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లారు. మునుగోడు సభకు హాజరై.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. షా టూర్‌లో మొత్తం చర్చను మరో లెవల్‌కు తీసుకెళ్లింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీనే.
జూనియర్ ఎన్టీఆర్‌ను ఎందుకు పిలిచారు? ఆయనతో అమిత్ షా ఏం మాట్లాడారు? అసలు ఈ భేటీ ఏర్పాటు చేసింది ఎవరు? బీజేపీ రాజకీయం వ్యూహం ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు రెండు రోజులుగా షికారు చేస్తున్నాయి. పైగా అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఏకాంతంగా 20 నిమిషాలు చర్చలు జరపడం మరిన్ని ఊహాగానాలకు తెరతీస్తోంది. షాతోపాటు.. జూనియర్ ఎన్టీఆర్‌లు .. వారి భేటీపై వేర్వేరుగా ట్వీట్లు చేసినా.. లోగుట్టు ఇంకేదో ఉందన్ని సామాన్య ప్రజలు సైతం అనుమానిస్తున్న పరిస్థితి.
జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో అందరికీ తెలిసిందే. గతంలో టీడీపీ తరఫున ఓపెన్‌గానే ప్రచారం చేశారు. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా.. ఆయన తెలుగుదేశం మనిషిగానే ముద్ర ఉంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ మధ్య రాజకీయాలపై మీడియా ప్రశ్నిస్తే.. ఇది సమయం సందర్భం కాదని సమాధానం దాట వేశారు. అంతేకానీ.. తాను రాజకీయాలకు దూరమని కానీ.. దూరంగా ఉంటానని కానీ చెప్పలేదు. పాలిటిక్స్‌కు తన జీవితంలో స్పెస్ ఉందనే అర్థం వచ్చేలా మాట్లాడారని విశ్లేషించారు చాలా మంది. ఆ స్పెస్‌ను బీజేపీ ఉపయోగించుకోవాలని చూస్తుందో ఏమో.. అమిత్ షా నేరుగా ఎంట్రీ ఇచ్చేశారు. అక్కడా ఇక్కడా కాకుండా హైదరాబాద్ పర్యటనలోనే జూనియర్ ఎన్టీఆర్‌తో ముఖాముఖీ మాటలు కలిపేశారు. బీజేపీలోకి రావాలని ఎన్టీఆర్‌ను అమిత్ షా ఆహ్వానించే ఉంటారని అందరూ చెప్పేమాట. అయితే దానికి ఎన్టీఆర్ ఏం సమాధానం ఇచ్చారన్నదే ప్రశ్న.
ఎన్టీఆర్ బీజేపీకి సానుకూలంగా ఉంటే.. అది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పార్టీకి కలిసి వస్తుందనే లెక్కలు కమలనాథుల్లో ఉండొచ్చు. ఏపీలో ఎలాగున్నా.. తెలంగాణలోని కమ్మ సామాజికవర్గాన్ని.. ఎన్టీఆర్ అభిమానులను బీజేపీ వైపు తిప్పుకొనే ప్లాన్ వేసిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీలో మోడీ.. అమిత్ షాల హవా మొదలైన తర్వాత కిటుకులేవీ బయటకు రావడం లేదు. అన్ని రహస్య చర్చలే. సరైన సమయంలో సరైన నిర్ణయం అన్నట్టుగా ఎత్తుగడలు ఉంటున్నాయి. రాజకీయంగా కీలకమని భావిస్తే నేరుగా మోడీ, అమిత్ షాలలో ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారనే చర్చ ఉంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అవే లెక్కలు బయటకు తీస్తున్నారు.
అమిత్ షా వేసిన ఈ రామబాణం గురివైపు వెళ్తుందో లేదో కానీ.. ఆసక్తికర చర్చకు.. ప్రజల అటెన్షన్‌కు ఆస్కారం కల్పించారు కమలనాథులు. మరి.. ఈ ఎత్తుగడ రాజకీయంగా బీజేపీకి వర్కవుట్ అవుతుందో చూడాలి.