Burugupalli Sesha Rao : ఆ నియోజకవర్గంలో టీడీపీ హవాకు మొన్నటి ఎన్నికల్లో చెక్ పడింది. పత్తా లేకుండా పోయారు పార్టీ నేతలు. కార్యక్రమాల స్పీడ్ తగ్గి.. కేడర్ డల్ అయ్యిందట. జనాల్లోకి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే ఎందుకు జంకుతున్నారో తమ్ముళ్లకు అర్థం కావడం లేదట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
నిడదవోలు. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట లాంటి నియోజకవర్గం. 2009లో నియోజకవర్గంగా ఏర్పడిన నిడదవోలులో వరుసగా రెండుసార్లు టీడీపీదే గెలుపు. 2019లో మాత్రం ఓటమి తప్పలేదు. వైసీపీ గాలిలో ఈ సెగ్మెంట్ కూడా టీడీపీ నుంచి జారిపోయింది. ఆ ఓటమితో కుంగిపోయారో ఏమో నియోజకవర్గంలో అసలు టీడీపీ ఉందా లేదా అన్నట్టుగా తయారైందట పరిస్థితి. రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన బూరుగుపల్లి శేషారావు ఎక్కడున్నారో కేడర్‌కు అంతుచిక్క లేదట. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీని నడిపించేవాళ్లు లేక తమ్ముళ్లు డీల పడ్డారట.
2019లోనే శేషారావుకు టికెట్ ఇవ్వొద్దని కొందరు టీడీపీ నేతలు గొడవ చేశారు. చంద్రబాబు దగ్గరకు చాలా పైరవీలు చేశారట. అవన్నీ బెడిసికొట్టాయి. చివరకు ఎన్నికల్లో శేషారావు ఓటమికి వాళ్లంతా కారణమయ్యారని టాక్. ఇప్పటికీ శేషారావుపై వాళ్లు అదే వైఖరితో ఉన్నట్టు సమాచారం. వర్గపోరుకు కేంద్రంగా ఉన్నవాళ్లైనా పార్టీని పట్టిచుకోవడం లేదట. ఈ గొడవ మనకెందుకు అనుకున్నారో ఏమో.. కొన్నాళ్లు శేషారావు కూడా అడ్రస్ లేరట. అయితే శేషారావే ఇక్కడ నెగ్గుకు రాగలరని పార్టీలో కొందరు కోరస్ ఇస్తున్నారట.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మూడేళ్లుగా చప్పుడు చేయని టీడీపీ నిరసనల పేరుతో కార్యక్రమాలు చేపడుతోంది. ఆ ప్రభావం నిడదవోలులోనూ ఉందని తెలుగు తమ్ముళ్లు పార్టీ నేతలకు చెబుతున్నారట. కొద్దిగా దృష్టిపెడితే నిడదవోలులో మళ్లీ టీడీపీ జెండా ఎగరేయొచ్చనేది కేడర్ మాట. దానిని దృష్టిలో పెట్టుకునే ఆ మధ్య చంద్రబాబు ఎదుట గట్టిగా వాదించారట స్థానిక పార్టీ నేతలు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి జనసేన కూడా కొంత కారణమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జనసేనకు 30 వేల వరకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రెండు పార్టీలు దగ్గరయ్యే సంకేతాలు ఉండటంతో ఆశలు చిగురిస్తున్నాయట.
చంద్రబాబు దృష్టి మాత్రం శేషారావుపైనే ఉందని పార్టీ వర్గాల వాదన. అయితే ఆర్థిక ఇబ్బందులకు తోడు వర్గపోరుతో ఇబ్బంది పడుతున్నట్టు శేషారావే నేరుగా చంద్రబాబుకు చెప్పేశారట. వాటిని తాను పరిష్కరిస్తానని.. నిడదవోలులో యాక్టివ్ కావాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారట. దాంతో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ.. మనసులో ఎక్కడో అనుమానాలు అలాగే ఉండిపోయినట్టు తెలుస్తోంది. నిడదవోలు పక్కన కొవ్వూరు ఉంటుంది. ఆ ప్రభావం ఇక్కడా కనిపిస్తుంది. ఒకవేళ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో నిడదవోలు ఉంటుందని టాక్. మరికొద్ది రోజుల్లోనే స్పష్టత ఇస్తారని సమాచారం. ముందుగా గ్రూపు తగాదాలకు చెక్‌పెట్టి అందరికీ పని నిర్దేశిస్తారని అనుకుంటున్నారట. మరి.. శేషారావును అభ్యర్థిగా ప్రకటిస్తారా.. లేక కొత్తవారిని తెరపైకి తెస్తారా అనేది చూడాలి.