పార్టీల రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు నియోజకవర్గాలకు వస్తే.. స్థానిక నేతలు శాలువాలు కప్పి సత్కరిస్తారు.. లేదా పూల బొకేలు చేతిలో పెడతారు. ఆ జిల్లాలో మాత్రం జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పిడిగుద్దులు రుచి చూపించారట. వచ్చిన నాయకుడిని ఓ రేంజ్‌లో కుమ్మేశారట. సొంత పార్టీ నేతపై కేడర్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి దారి తీసిన కారణాలేంటి?
సంగారెడ్డి జిల్లా బీజేపీలో కోవర్టు రాజకీయాల హీట్
బీజేపీలో క్రమశిక్షణ ఎక్కువ అని చెబుతారు. అసంతృప్తి ఉన్నా పెద్దగా బయటకు చెప్పుకోరు. కాకపోతే పార్టీ పెద్దలకు ఫిర్యాదులూ గట్టిగానే వెళ్తుంటాయి. వాటిపై చర్యలు తీసుకుంటారు. ఈ విధానం లాభం లేదని అనుకున్నారో ఏమో.. సంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు ఎంచుకున్న మార్గం కాషాయ శిబిరంలో చర్చగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డిపై స్థానిక నేతలకు పీకలదాకా ఆగ్రహం ఉందట. ఆయనే కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు పార్టీ నాయకులు. ఈ సమస్య శ్రుతిమించి ఆయనపై సొంత పార్టీ నేతలే దాడి చేసే వరకు వెళ్లినట్టు కాషాయ దండు చెవులు కొరుక్కుంటోంది.
.
పాతవారిని విస్మరించడంపై కేడర్ గగ్గోలు
జిల్లాలో బీజేపీ పుంజుకుంటుంది అని భావిస్తున్న చోట.. ఇతర పార్టీల నేతలను తీసుకొచ్చి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారనేది నరేందర్‌రెడ్డిపై స్థానిక నాయకుల ఆరోపణ. కొద్దికాలంగా నియోజకవర్గాల్లో వర్గపోరుకు ఇదే కారణమని ఫిర్యాదు చేస్తున్నారట. బీజేపీలో చేరిన కొత్తవారికి ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పులేకపోయినా.. అదే పనిగా పాతవారిని విస్మరిస్తే అనుమానించాల్సి వస్తోందని కేడర్ వాపోతోందట. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సంగారెడ్డిలో బీజేపీ ప్రజాగోస.. బీజేపీ భరోసా యాత్ర చేపట్టింది. ఇక్కడ బీజేపీ ఇంఛార్జ్‌ను కాదని.. మరో నేత వచ్చి యాత్ర చేయడం వెనుక నరేందర్‌రెడ్డి పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 14న జహీరాబాద్‌లోనూ సరిగ్గా సంగారెడ్డి లాంటి ఘటనే జరిగిందని పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. జహీరాబాద్ బీజేపీ ఇంఛార్జ్‌ను కాదని.. మరో వ్యక్తి పెత్తనంతో సమస్యలు వస్తున్నాయని పార్టీ పెద్దలకు చెప్పారట.
జహీరాబాద్ వచ్చిన జిల్లా చీఫ్‌పై దాడి?
జహీరాబాద్ బీజేపీలో ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య టికెట్ ఫైట్ నడుస్తోంది. సమస్య చినికి చినికి గాలి వానగా మారడంతో.. సర్దుబాటు చేయడానికి నరేందర్‌రెడ్డి చొరవ తీసుకున్నారట. అలా వచ్చిన నరేందర్‌రెడ్డిపై పార్టీ కేడర్ దాడి చేసినట్టు చెబుతున్నారు. దాంతో అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారట నరేందర్‌రెడ్డి. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల బీజేపీ కేడర్ నుంచి జిల్లా అధ్యక్షుడి తీరుపై రాష్ట్ర పార్టీకి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. కోవర్టు రాజకీయాలు.. వర్గపోరును ప్రోత్సహించేలా నరేందర్‌రెడ్డి తీరు ఉందని ఆ ఫిర్యాదుల్లో ప్రధానంగా ఆరోపించారట. జహీరాబాద్ ఘటనలు కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా వెళ్లిందట. సంగారెడ్డి బీజేపీలో గొడవలు మరింత శ్రుతిమించకుండా రాష్ట్ర పార్టీ పెద్దలు చర్యలు తీసుకుంటారో లేదో అని కేడర్ చెవులు కొరుక్కుంటోంది.