మసిఉల్లా.. తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు మసిఉల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక కేసులో ఆయన పేరును ముడిపెడుతూ విపక్షాలు అంతెత్తున లేస్తున్నాయి. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలనే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఈ వ్యవహారంలో అధికారపార్టీ ఏం చేస్తుందనే చర్చ మొదలైంది.
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు మసిఉల్లా. ఇటీవలే తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ అయ్యారు. అయితే మసిఉల్లా నియామకంపై టీఆర్ఎస్‌లోని కొంతమంది మైనారిటీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. అత్యంత కీలకమైన వక్ఫ్ బోర్డుకు మసిఉల్లా ఛైర్మన్‌గా తగిన వ్యక్తి కాదన్నది వారి వాదనట. ఆయన వల్ల గులాబీ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని ముందుగానే ఊహించమని ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ గళం పెంచుతున్నారు. ఈ విషయంలో అసంతృప్త నాయకులు ముందు వరసలో ఉన్నారు. తాజాగా ఒక కేసు వెలుగులోకి వచ్చాక మసిఉల్లా కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది.
రాజకీయ ఒత్తిడులు.. నైతికతను దృష్టిలో పెట్టుకుని మసిఉల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ సూచించారట. మసిఉల్లా మాత్రం రాజీనామాకు సిద్ధంగా లేనన్న సంకేతాలు పంపుతున్నారట. ఇటు ప్రభుత్వం నేరుగా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను తొలగించడానికి అవకాశం లేదట. ఆ సాంకేతిక అంశాలను అడ్డంగా పెట్టుకున్న ఆయన రాజీనామాకు ససేమిరా అంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయట.
తాజాగా వచ్చిన ఆరోపణలు మరేదైనా నాయకుడిపై వచ్చి ఉంటే పార్టీ కూడా వేగంగా చర్యలు తీసుకునే అవకాశం కలిగేది. ఇక్కడ మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్నది మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉందట. పైగా ఆ కేసు విషయంలో విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని గట్టిగానే కార్నర్ చేస్తున్నాయి. మసిఉల్లా చూట్టూ విమర్శల వేడి పెంచుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో సొంత పార్టీకి రాజకీయంగా ఉపశమనం కలిగించేందుకు మసిఉల్లా మనసు మార్చుకుంటారో లేదో చూడాలి.