హుజురాబాద్ ఉపఎన్నికను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటుందా? ఇంకా గ్రౌండ్‌లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు? పరువుకు ప్రాధాన్యం ఇచ్చి.. ఫలితం గాలికి వదిలేసిందా?
ఇంకా మొదలు కాని కాంగ్రెస్ ప్రచారం..!
హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుంచి నాన్ సీరియస్సే. గాంధీభవన్‌లో ఉపఎన్నిక సందడే లేదు. అసలు రాష్ట్రంలో ఒక ఉపఎన్నిక జరుగుతుందనే సోయి పార్టీ నేతల్లో ఉందో లేదో అనే డౌట్ కేడర్‌ది. మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దించాలని భావించి భంగపడింది. ఆమె నో చెప్పడంతో NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను తెరమీదకు తెచ్చింది. నిరుద్యోగ సమస్యను ప్రచార అజెండాగా చేసుకోబోతోంది కాంగ్రెస్. ఇంత వరకు బాగానే ఉన్నా.. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగుస్తుంది. ఇంకా కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టలేదు.
ప్రచారానికి మిగిలింది 20 రోజులే..!
వెంకట్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ పెద్దలు రేవంత్, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు హుజురాబాద్ వెళ్లాలని ప్లాన్ వేశారు. మిగతా సీనియర్లు హుజురాబాద్ ఎప్పుడు చేరుకోవాలో.. ఎవరేం పనిచేయాలో ఇప్పుడిప్పుడే కొలిక్కి తెస్తున్నారట. అటు చూస్తే ఈ నెల 30నే పోలింగ్. ప్రచారానికి మిగిలింది 20 రోజులే. ఇంత తక్కువ సమయంలో హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఏ స్థాయిలో ప్రచారం చేస్తుందన్నది ఒక ప్రశ్న.
సొంత పార్టీ నేతలను బుజ్జగించడమే పెద్ద టాస్క్..!
హుజురాబాద్‌లో జనంలోకి వెళ్లడం కంటే.. ముందు సొంతపార్టీ నాయకులను బుజ్జగించే పనే కాంగ్రెస్‌లో పెద్ద టాస్క్. అభ్యర్థిగా తెరపైకి వచ్చాక.. పీసీసీకి వ్యతిరేక బ్యాచ్ దగ్గరకు వెళ్లే పని పెట్టుకున్నారు వెంకట. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇంటికెళ్లి మాట్లాడొచ్చారు. సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హుజురాబాద్‌లో పార్టీ టికెట్ ఆశించిన 19 మందిని గాంధీభవన్‌కు పిలిచి మాట్లాడారు కొందరు కాంగ్రెస్ పెద్దలు. వారిని బుజ్జగించారు కూడా. అయినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డి అలక వీడలేదట.
ప్రచారాన్ని ఎవరు ముందుండి నడిపిస్తారు?
ఉపఎన్నికలో ప్రచార వ్యూహం ఏంటి? ప్రచారాన్ని ఎవరు ముందుండి నడిపిస్తారు? ఉపఎన్నిక పార్టీ ఇంఛార్జ్ దామోదర రాజనర్సింహ హుజురాబాద్‌లో ఉంటారా? పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏం చేస్తారు? ఉపఎన్నికలో ఆయన రోల్ ఏంటి? ప్రస్తుతం వీటి చుట్టూనే పార్టీలో ఎక్కువ చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి శ్రీధర్‌బాబుకు అభ్యర్థి వెంకట్ సన్నిహితుడు. సో.. శ్రీధర్‌బాబు ప్రచారానికి వెళ్తారు. సీఎల్పీ నేత భట్టికి కూడా వెంకట్ నమ్మిన వ్యక్తి. భట్టి కూడా ప్రచారంలో కనిపిస్తారని చెబుతున్నారు. మరి.. పీసీసీ చీఫ్ రేవంత్ ప్లాన్ ఏంటో ఇంకా క్లారిటీ లేదట. మరి.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాతైనా కాంగ్రెస్ ఉపఎన్నిక వ్యూహం కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.