ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో మెట్ట రాజకీయాలు డిఫరెంట్. ఇందులో జగ్గంపేట రాజకీయాలు ఇంకా ఆసక్తికరం. గడిచిన నాలుగు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే రెండుసార్లు కాంగ్రెస్, మరో రెండుసార్లు వైసీపీ గెలిచాయి. అభ్యర్థులు ఎవరైనప్పటికీ పార్టీలే జగ్గంపేటలో కీలకమని టాక్. 2004, 2009 ఎన్నికల్లో వరసగా రెండుసార్లు మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో జగ్గంపేట ప్రజలు వైసీపీని గెలిపించారు. 2004లో టీడీపీ నుంచి 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ ఓడిపోయారు. 2014లో మాత్రం వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు నెహ్రూ. తర్వాత పసుపు కండువా కప్పేసుకున్నారు. 2019లో నెహ్రూ టీడీపీ నుంచి బరిలో దిగినా ఓటమి తప్పలేదు. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన జ్యోతుల చంటిబాబు.. 2019లో వైసీపీ అభ్యర్థిగా మారిపోయారు. ఆ ఎన్నికల్లో గెలిచారు. దీంతో జగ్గంపేట ప్రజలు పార్టీలను గెలిపిస్తారు తప్ప.. అభ్యర్థులను కాదనే ప్రచారం బలపడింది.
మూడేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న జగ్గంపేట రాజకీయాలు ఎన్నికలకు రెండేళ్ల ముందే వేడెక్కుతున్నాయి. గడప గడపకు వైసీపీ పేరుతో ఎమ్మెల్యే చంటిబాబు తిరుగుతున్నారు. ఇదే సమయంలోటీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బాదుడే బాదుడు అని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి తోట నరసింహం తిరిగి యాక్టివ్ రోల్ పోషించడానికి సిద్ధమయ్యారు. నరసింహం చురుకుగా తిరిగితే జగ్గంపేట వైసీపీపై పడే ప్రభవం ఏంటి? అధికారపార్టీలో జరిగే మార్పులేంటి? అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుంది? ఇలా అనేక ప్రశ్నలు స్థానికంగా చర్చల్లో ఉన్నాయి.
ప్రస్తుతం జగ్గంపేటలో అధికార వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, మాజీ మంత్రి తోట నరసింహం వర్గాలుగా ఉంది పార్టీ. రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని తోట చేసిన ప్రకటనలో వైసీపీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారట. రెండుసార్లు మంత్రిగా.. ఒకసారి ఎంపీగా గెలిచిన తోట నరసింహానికి జగ్గంపేటలో పట్టు ఉంది. గత ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో వైసీపీలో చేరడంతో జగ్గంపేట టికెట్ రాలేదు. కానీ.. తోట భార్యకు పెద్దాపురం సీటు ఇచ్చారు. ఆమె అక్కడ ఓడిపోయారు. దీంతో రాజకీయంగా తనకు అచ్చొచ్చిన జగ్గంపేటలోనే భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే పనిలో పడ్డారు నరసింహం.
2024లో తోట నరసింహం ఎన్నికల్లో పోటీ చేస్తారని.. ఆయన తప్పక గెలుస్తారనేది ఆయన వర్గం లెక్క. జ్యోతుల నెహ్రూ బలమైన నేతే అయినప్పటికీ పార్టీ బలహీరంగా ఉంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే.. అప్పుడు జ్యోతుల నెహ్రూ బరిలో దిగితే సమీకరణాలు మారే అవకాశం ఉందట. పైగా జనసేనకు జగ్గంపేటలో బలమైన నాయకుడు లేకపోవడం కూడా నెహ్రూకు కలిసివచ్చినట్టు చెబుతున్నారు. అప్పుడు వైసీపీ, టీడీపల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని లెక్కలతో కుస్తీ పడుతున్నారట. మొత్తానికి జగ్గంపేట రాజకీయం జంక్షన్‌లో జామై ఆసక్తి రేకెత్తిస్తోంది.