బీజేపీలో రాష్ట్ర కమిటీ కంటే పవర్ ఫుల్ కోర్ కమిటీ. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన నాయకులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తుంది జాతీయ నాయకత్వం. ఇందులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కూడా ఉంటారు. అయితే తెలంగాణలో విస్తరించాలని.. అధికారంలోకి రావాలని చూస్తోన్న కమలనాథులు.. కోర్ కమిటీ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. దీనిపై మాట్లాడేవారు .. ప్రశ్నించేవారూ కూడా కరువయ్యారు. ప్రధాని మోడీ.. అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తెలంగాణకు వచ్చి వెళ్తున్నా.. కీలక కమిటీ విషయంలో అలికిడి చేయడం లేదు. ఇది రాష్ట్ర బీజేపీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోందట. కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఈ కమిటీలో చర్చిస్తారు. రాష్ట్రంలో అలాంటి అవకాశం లేకుండా పోయిందనేది కొందరు సీనియర్ల వాదనగా ఉంది.
తెలంగాణకు డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 11 మందితో కోర్ కమిటీ ఉండేది. ఆ తర్వాత ఆ సంఖ్య పెరిగింది కూడా. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర సారథిగా వచ్చాక కోర్ కమిటీ ప్రస్తావన లేదు. కేంద్ర కమిటీ కూడా ఈ దిశగా ఫోకస్ పెట్టిన ఉదంతాలు లేవు. గతంలో కోర్ కమిటీలో సభ్యులుగా ఉన్నవారు.. కొత్తగా కాషాయ కండువా కప్పుకొన్న మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతో ఢిల్లీ నేతలు వచ్చినప్పుడు కోర్ కమిటీ పేరుతో సమావేశం అవుతున్నా.. అది అధికారిక కమిటీ కాదు. పైగా ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు ఎంత వరకు అధికారికం అవుతాయన్నది కొందరి ప్రశ్న.
తెలంగాణ పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కోర్ కమిటీని ఏర్పాటు చేసే చాలా రోజులైంది. పలు దఫాలుగా సమావేశమై చర్చలు కూడా జరిపారు. ఇటీవల ఏపీలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఆ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఆ భేటీ గురించి బయటకు రాగానే తెలంగాణలో ఈ అంశంపై చర్చ మొదలైంది. జాతీయ పార్టీ కీలక కమిటీలు ఖాళీగా ఉండొద్దని పదే పదే చెబుతోంది. కానీ.. కోర్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన జాతీయ నాయకత్వమే దాన్ని పట్టించుకోకపోవడం కాషాయ శిబిరానికి అంతుచిక్కడం లేదట.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో నేతల సంఖ్య పెరిగిపోయింది. వారిలో కొందరినే కోర్ కమిటీలో చోటు కల్పించి.. మిగతా వారిని పక్కన పెడితే కొత్త తలనొప్పులు వస్తాయనే అనుమానంతో పెండింగ్లో పెట్టినట్టు అనుమానిస్తున్నారట. రాష్ట్ర పదాధికారుల కంటే ఎక్కువ మంది కోర్ కమిటీలోకి వచ్చే అవకాశం ఉండటంతో.. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదని అభిప్రాయ పడుతున్నారట. తెలంగాణలో ఉన్నంతగా ఏపీలో సీనియర్లు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు లేరు. అందుకే అక్కడ కమిటీ కూర్పు ఈజీ అయిపోయింది. కానీ.. ఇక్కడ మాత్రం కాషాయ కండువా కప్పుకొన్నవారిలో ఎక్కువ మంది మాజీ మంత్రులు, కేబినెట్ ర్యాంక్ స్థాయిలో పదవులు అనుభవించిన సీనియర్లు ఉన్నారు. అందుకే వెనకాడుతున్నట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి.. ఆ ఒక్కటీ అడక్కు అని ఢిల్లీ నాయకత్వం ఎన్నాళ్లు నెట్టుకొస్తుందో చూడాలి.