బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీకి కొత్త జవసత్వాలు రాకపోగా.. నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు భగ్గుమంది. కొత్తగా కాషాయ కండువా కప్పుకొన్న నేతలు ఉత్సాహంగా దూసుకెళ్దామని చూస్తుంటే పార్టీలోకి పాతకాపులు వారి కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారట. వలస నేతలు రావడంతో నియోజకవర్గాల్లో నాయకత్వానికి కొరత తీరుతుందని భావిస్తే.. ఆ దిశగా అడుగులే పడటం లేదట. దాదాపు నెల రోజుల పాటు అలంపూర్ మొదలు షాద్‌నగర్ వరకు సంజయ్ పాదయాత్ర సాగింది. అలంపూర్ , గద్వాల , మక్తల్ , నారాయణపేట , దేవరకద్ర, మహబూబ్‌నగర్ , జడ్చర్ల , షాద్‌నగర్ నియోజకవర్గాల మీదుగా వెళ్లిన పాదయాత్రలో పలు సభలూ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలుంటాయని పెద్దఎత్తున ప్రచారం చేసినప్పటికీ.. ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా చేరలేదు.
పార్టీలో కొత్త, పాత నాయకత్వాలకు అస్సలు పడటం లేదు. ఇందుకు జిల్లా అధ్యక్షుడి హోదాలో బీజేపీకి గుడ్‌బై చెప్పిన ఎర్రశేఖర్ ఉదంతాన్ని కొందరు ఉదహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణల మధ్య పార్టీ రెండు వర్గాలుగా చీలినట్టు ప్రచారం జరుగుతోంది. పైపెచ్చు క్షేత్రస్థాయిలో పార్టీకి కేడర్ బలంగా లేదు. సంజయ్ పాదయాత్రతో కేడర్ లోటు తీరిపోతుందని అంచనా వేసినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదట. అలంపూర్‌లో పాదయాత్రను ముందుండి నడిపించే నాయకుడు లేక ఆ వెలితి కనిపించింది. కాకపోతే ఎన్నికల నాటికి ఒక ఎన్నారై కాషాయ కండువా కప్పుకొని పార్టీ బాధ్యతలు తీసుకుంటారని చర్చ నడుస్తోంది.
గద్వాల డీకే అరుణ ఇలాకా అయినప్పటికీ ఆమె మహబూబ్‌నగర్ ఎంపీ సీటుపై ఫోకస్ పెట్టడంతో అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదట. గద్వాల నుంచి డీకే అరుణ కుమార్తె స్నిగ్దారెడ్డి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. మక్తల్‌లో పార్టీ నేతలు కొండయ్య, జలందర్‌రెడ్డి మధ్య అస్సలు పడటం లేదు. సంజయ్ యాత్రలోనే ఇద్దరూ బలప్రదర్శనకు దిగారు. నారాయణపేటలో పాండురెడ్డి, నామాజీ, సత్యయాదవ్‌ల గ్రూపులు.. దేవరకద్రలో పవన్‌కుమార్, నర్సింహలు, సుదర్శన్‌రెరడ్డి వర్గాల మధ్య నిత్యం సెగలు రాజుకుంటున్నాయి. దేవరకద్రలో పరస్పరం దాడులు చేసుకున్నారు కూడా. జడ్చర్లలో త్రిపురల సుందరి, శాంతకుమార్ వర్గాలు పట్టుబిగిస్తున్నాయి.
మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభ విజయవంతమైందని పార్టీ శ్రేణులు చెబుతున్నా.. పాదయాత్ర పేలవంగా సాగిందనేది కాషాయ శిబిరంలో చెవులు కొరుక్కుంటున్నారట. స్థానిక నేతలు లేకపోవడంతో పాదయత్రలో ఆ లోటు స్పష్టంగా కనిపించిందట. మొత్తంగా సంజయ్ పాదయాత్ర సక్సెస్ అయిందని పార్టీ నేతలు చెబుతున్నా.. జిల్లాలో పాత, కొత్త నాయకుల మధ్య రాజుకున్న వర్గపోరే కలవర పెడుతోందట. మరి.. ఈ సమస్య పెద్దది కాకుండా కమలనాథులు ఎలాంటి చికిత్స చేస్తారో చూడాలి.