సంగారెడ్డి జిల్లా ఆందోల్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత.. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ.. మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న బాబూమోహన్ ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. వేర్వేరు పార్టీలకు చెందిన ఈ ఇద్దరు నాయకులు.. పుల్కల్ మండలంలోని పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనలకు వచ్చారు. కలిసి రాకపోయినా.. ఇక్కడకి వచ్చాక కలిసి ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. పార్టీల మధ్య ఉన్న వైరం నేతల మధ్య కనిపించకపోయినా.. పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకోవడం చర్చకు దారితీసింది. వారి మధ్య చర్చకు వచ్చిన అంశాలు.. అక్కడే ఉన్నవారికి వినోదం కలిగించాయి.
రాజనర్సింహ.. బాబూమోహన్ ఇద్దరూ గతంలో ఆందోల్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లే. ఇద్దరూ మంత్రులుగా పనిచేశారు కూడా. ప్రస్తుతం ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతిది టీఆర్‌ఎస్ పార్టీ. మూడు పార్టీలు.. ముగ్గురు నేతలకు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది. గతంలో మంత్రులుగా చేయడంతో రాజనర్సింహ.. బాబూమోహన్‌ల మధ్య ఆందోల్ అభివృద్ధి పనులపై కాసేపు చర్చ జరిగింది. ప్రభుత్వ పనితీరుపైనా ఓపెన్‌గానే మాట్లాడేసుకున్నారు. అసలు కథ ఈ భేటీ తర్వాతే మొదలైంది. సోషల్ మీడియాలో ఎవరికి వారుగా విశ్లేషణలు మొదలుపెట్టేశారు. ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ పెట్టడంతో అవి వైరల్ అవుతున్నాయి.
అయితే రాజనర్సింహ, బాబూమోహన్ కలిసి దిగిన ఫొటోలకు వేరే అర్థాలు వచ్చేలా టీఆర్ఎస్‌కు చెందిన కొందరు సోషల్ మీడియాను వాడేసుకున్నారు. ఇద్దరినీ రహస్య మిత్రుల చీకటి ఒప్పందంగా క్యాప్షన్స్ పెట్టారు. కొన్ని పోస్టుల్లో శ్రుతిమించిన వ్యాఖ్యానాలు ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఆందోల్‌లో ఈ పోస్టులు.. కౌంటర్లే ప్రస్తుతం హాట్ టాపిక్. మొత్తానికి ఇద్దరు నేతల ఆత్మీయ పలకరింపులు.. అనేక ఊహాగానాలకు దారితీస్తున్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు పావులు కదుపుతారో.. లేక గుడి దగ్గర కలిసిన మాటలను అక్కడే వదిలేశామని చెబుతారో చూడాలి.