ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా ఉన్నారు. రాజకీయాల్లో ఎంత బిజీనో.. సొంత వ్యాపార కార్యకలాపాల్లోనూ అంతే బిజీగా ఉంటారట. దాంతో నియోజకవర్గంలో ప్రజలకు చిక్కరు.. దొరకరనే ముద్ర పడిపోయింది. ఎవరా మంత్రి?
ఆత్మకూరులో మంత్రి చిక్కరు.. దొరకరు..?
మేకపాటి గౌతంరెడ్డి. ఏపీ మంత్రి. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. సీఎం జగన్‌కు సన్నిహితమనే ముద్ర ఉంది. మేకపాటి కుటుంబానికి సొంత వ్యాపారాలు ఎక్కువే. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నుంచి రెండోసారి గెలిచిన గౌతంరెడ్డి తమ నియోజకవర్గానికి అసెట్‌గా మారతారని ప్రజలు భావించారు. సీఎంతో ఉన్న సాన్నిహిత్యంవల్ల ఆత్మకూరుకు బంగారు యోగం పడుతుందని.. సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయని ఆశించారు స్థానిక జనం. కానీ.. సీన్ మరోలా ఉందట. చిక్కరు.. దొరకరు అని మంత్రి గురించి ఆత్మకూరులో ఒక్కటే గుసగుసలు.
జిల్లాకు వచ్చినా.. నెల్లూరులోనే ఉండిపోతారట..!
మంత్రి గౌతంరెడ్డి అందుబాటులో ఉండటం లేదన్నది ఆత్మకూరు ప్రజల ఆరోపణ. అత్యవసర పరిస్థితుల్లోనూ ఆయన ఎక్కడుంటారో తెలియదట. నియోజకవర్గంలో ప్రధాన సంఘటనలు జరిగినప్పుడు ఆ సమాచారం చెప్పాలంటే ఫోన్లు తీయడం లేదని స్థానిక వైసీపీ నేతలు వాపోతున్నారట. గౌతంరెడ్డికి సమయం కుదిరినా.. ఓపిక.. తీరిక దొరికినా జిల్లాకు వస్తారని.. అయితే ఎక్కువ టైమ్ నెల్లూరులోనే ఉండి వెళ్లిపోతారని కేడర్ చెప్పేమాట. ఏదైనా సమస్య చెప్పాలని పార్టీ నేతలు నెల్లూరు వెళ్లినా మంత్రిగారి దర్శన భాగ్యం దొరకడం కష్టమని చెబుతున్నారు.
ఆత్మకూరులో పేరుకే మంత్రి ఆఫీస్ ఉందా?
మంత్రి గౌతంరెడ్డి ఇంట్లోనే ఉన్నారని తెలిసి వెళ్తే.. ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడబోరని వచ్చిన వాళ్లను వెనక్కి పంపించి వేస్తారట సిబ్బంది. దీంతో సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు నిరాశతో వెనుదిరుగుతున్నారని కేడర్ చెబుతోంది. ఆత్మకూరులో పేరుకు ఆఫీస్ ఉన్నా.. అక్కడికి రారట. ఇటీవల భారీ వరదలతో ఆత్మకూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు మునిగిపోయాయి. బాధితులు చాలా ఇబ్బంది పడ్డారు. వరద తగ్గాక.. మంత్రి గౌతంరెడ్డి పర్యటనకు రావడంతో ఎక్కడికక్కడ బాధితులు ప్రశ్నించడం పార్టీలో చర్చగా మారింది. ఎప్పుడో వరదలొస్తే ఇప్పుడా రావడం అని కొన్నిచోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేడర్‌లో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని మంత్రి గమనించారా?
మంత్రి అందుబాటులో లేకపోతే.. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని జనం, పార్టీ కేడర్ ప్రశ్నిస్తున్నారట. సంగం సమీపంలోని బీరాపేరు వాగులో ఆటోపడి పలువురు చనిపోయినా గౌతంరెడ్డి స్పందించలేదన్నది కొందరి ఆరోపణ. మరి.. కేడర్‌లో.. నియోజకవర్గ ప్రజల్లో గూడుకట్టుకున్న ఈ అసంతృప్తిని మంత్రి గౌతంరెడ్డి గమనించారో లేదో.. ఆయనలో మార్పు వస్తే అదే పదివేలని అభిప్రాయపడుతున్నాయి వైసీపీ శ్రేణులు.