గెల్చిన ఎమ్మెల్యే.. ఓడిన అభ్యర్థి ఇద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీ. ఎవరి పదవి వాళ్లదే. అంతా బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇస్తారు? సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఉంటుందా? లేక ముందు నుంచీ పార్టీలో ఉన్న నేతను పిలుస్తారా? ఈ అంశం చుట్టూనే ఆసిఫాబాద్‌లో వాడీ వేడీ చర్చ జరుగుతోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్‌లో ఆధిపత్యపోరు..!
ఈయన పేరు ఆత్రం సక్కు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. తర్వాత గులాబీ కండువా కప్పేసుకుని కారెక్కేశారు. ఇక ఈమె కోవా లక్ష్మి. జడ్పీ ఛైర్‌పర్సన్. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన కోవా లక్ష్మి.. ఆత్రం సక్కు చేతిలోనే 171 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇద్దరూ టీఆర్‌ఎస్‌లో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి. పార్టీ పరంగా ఇబ్బందులు లేకుండా కోవా లక్ష్మిని జడ్పీ ఛైర్‌పర్సన్‌ను చేసినా.. క్షేత్రస్థాయిలో ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి. ఎవరి వర్గం వాళ్లదే. ఎవరి కార్యక్రమాలు వాళ్లవే. ఆసిఫాబాద్‌లో టీఆర్ఎస్ స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా.. ఆధిపత్యపోరు నివురు గప్పిన నిప్పులా ఉంది.
పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది? బరిలో ఉండేదెవరు?
కొత్తలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ ఛైర్‌పర్సన్ కోవా లక్ష్మిలు పార్టీ , ప్రభుత్వ కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నా.. ఇప్పుడా సీన్ లేదు. ఎమ్మెల్యే హాజరైన ప్రోగ్రామ్‌కు జడ్పీ ఛైర్‌పర్సన్ దూరంగా ఉంటున్నారట. అలాగే కోవా లక్ష్మి వెళ్తున్న కార్యక్రమాలకు ఆత్రం సక్కు వెళ్లడం లేదట. ఇప్పుడు ఇద్దరి దృష్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉన్నట్టు సమాచారం. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుంది? బరిలో ఉండేదెవరు? రాజకీయంగా ఎవరు చక్రం తిప్పుతారు? అనే అంశాలపై గులాబీ శ్రేణులు సైతం ఉత్కంఠగా చర్చించుకుంటున్నాయి.
ఇద్దరిలో టికెట్ రానివారి పరిస్థితి ఏంటి?
ఆత్రం సక్కు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. టీఆర్‌ఎస్‌లో చేరేవారికి జడ్పీ ఛైర్‌పర్సన్ కోవా లక్ష్మే గులాబీ కండువా కప్పుతున్నారట. అలా వచ్చినవారంతా కోవా గ్రూపునకు జై కొడుతుండటంతో ఆమె బలప్రదర్శనకు దిగుతున్నట్టు సమాచారం. ఇలా బలాన్ని పెంచుకుంటే అధిష్ఠానంపై ఒత్తిడి పెరిగి టికెట్ ఇస్తారని కోవా బృందం లెక్కలేస్తోందో ఏమో..! . ఇక తుడుందెబ్బ ఉద్యమంలో సోయం బాపురావ్ తర్వాత కీలకంగా ఉన్నది ఆత్రం సక్కే. ఆ ఎఫెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చిందని చెబుతారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో టికెట్ రానివారి పరిస్థితి ఏంటన్నది ఆసక్తిగా మారింది.
ఆత్రంను ఆదిలాబాద్ ఎంపీగా బరిలో దించుతారా?
ఇటీవల కాంగ్రెస్ యాక్టివిటీస్ కూడా పెరగడంతో.. ఆత్రంతోపాటు టీఆర్‌ఎస్‌లో చేరిన చాలా మంది వెనక్కి వెళ్లిపోతున్నారట. రేపటి రోజున టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే కూడా అక్కడికే వెళ్తారేమోనని చెవులు కొరుక్కుంటున్నారట. ఎవరేం అనుకున్నా.. ఆయన మాత్రం TRS టికెట్ తనదేనని ధీమగా ఉన్నట్టు సమాచారం. అయితే ఎన్నికల్లో ఇద్దరికీ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు. టికెట్ రానివారిని బుజ్జగించాల్సిందే. మరి.. బుజ్జగింపులు పనిచేస్తాయా లేదా అన్నది ప్రశ్న. ఇదే సమయంలో పార్టీ వర్గాల్లో ఇంకో చర్చ జరుగుతోంది. ఆత్రం సక్కును ఆదిలాబాద్ నుంచి ఎంపీగా బరిలో దించొచ్చని అనుకుంటున్నారట. అదే జరిగితే కోవా లక్ష్మికి లైన్ క్లియరైనట్టేనని టాక్. పార్టీ వ్యూహం ఏంటో స్పష్టత లేదు. సర్దుబాబుకు నాయకులిద్దరూ ఒప్పుకొంటారో లేదో తెలియదు. మరి.. ఆసిఫాబాద్ టీఆర్‌ఎస్‌లో పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.