రాజకీయంగా ఎదగడానికి కొందరు ఏ రోటికాడ ఆ పాట పాడతారు…! పొలిటికల్ లీడర్స్‌గా కుదురుకోవాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న ఆ సినీ దంపతులు కూడా అదే చేస్తున్నారా? తాజాగా అధికారపార్టీపై విమర్శలు చేసి.. ప్రత్యర్థులకు కార్నర్ అయ్యారా? రాజకీయంగానే కాకుండా.. సినిమా ఫీల్డ్‌లోనూ వారిని ప్రత్యర్థులుగా భావించేవాళ్లూ.. ఆ ఇద్దరినీ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారా? ఇంతకీ ఎంటీ రగడ? లెట్స్ వాచ్..!
జీవిత-రాజశేఖర్. వెండితెరపై ఒకప్పటి హిట్ పెయిర్. దంపతులుగా మారిన తర్వాత సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ ఒకే విధంగా అడుగులు వేస్తున్నారు. అది మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలైనా.. పొలిటికల్ పార్టీలైనా.. తళుక్కున మెరుస్తారు. అలా రెండు మూడు రోజులు చర్చల్లో హాట్ టాపిక్‌గా ఉంటారు. రాజకీయాల్లోకి చాలా మంది నటీనటులు వచ్చినా.. వారిలో సక్సెస్ అయ్యింది కొందరే. సినిమాల్లో అవకాశాల్లేక తెరమరుగైనట్టే.. పొలిటికల్ స్క్రీన్‌పై అవకాశాల్లేక పెట్టేబేడా సర్దుకున్నవాళ్లు అనేకమంది. జీవిత-రాజశేఖర్ అలా కాదు. అవకాశాల కోసం ఏళ్లతరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అలాఇప్పటికే ఐదు పార్టీలను ఒక చుట్టు చుట్టేశారు. ప్రస్తుతం బీజేపీ గూటిలో ఉన్నారు. ఇటీవల అధికార టీఆర్ఎస్‌పై బీజేపీ ఎంపీలు చేసిన లిక్కర్ స్కామ్ ఆరోపణలమీద గొంతు కలిపిన జీవిత తనదైన శైలిలో స్పందించారు. మా ఎన్నికల తర్వాత చర్చల్లో లేకుండా పోయినా ఆమె.. ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు.
అసలే తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. ఈ వేడిలోకి జీవిత రావడంతో.. ఆమెను తీవ్రంగానే కార్నర్ చేశాయి టీఆర్‌ఎస్ శ్రేణులు. సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకున్నారు. ఏ రోటికాడ ఆ పాట పాడతారని చురకలు వేస్తున్నారు. టీఆర్ఎస్ కౌంటర్‌కు తోడు.. నటుడు.. నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో చర్చ కాదు కాదు రచ్చ.. మరో లెవల్‌కు వెళ్లింది. రెండు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అన్ని పార్టీలు తిరిగిన ఈ ఆదర్శ దంపతులు అంటూ జీవిత- రాజశేఖర్‌లపై సెటైర్లు వేశారు బండ్ల గణేష్. అక్కడితో ఆగకుండా.. గతంలో జీవిత-రాజశేఖర్ వివిధ పార్టీలలో చేరిన సందర్భాలను గుర్తు చేస్తూ ఆ ఫొటోలతో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. మన రాష్ట్రంలో ఎన్ని జెండాలు ఉన్నాయో అన్నీ మెడలో వేసుకున్నారని ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
జీవిత రాజశేఖర్ దంపతులు మొదట టీడీపీ.. ఆ తర్వాత అన్న టీడీపీ.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ.. వైసీపీపార్టీల్లో ఉన్నారు. తర్వాత బీజేపీలో చేరి.. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నారు. బీజేపీలో ఎన్నాళ్లు ఉంటారో తెలియదనే విమర్శ ఉంది. ఈ పార్టీల గురించి ప్రస్తావిస్తూనే.. అన్ని పార్టీలు తిరిగారు.. ఇక రాష్ట్రంలో మిగిలిన సీపీఐ, సీపీఎంలలో కూడా చేరి అన్ని పార్టీలను బ్యాలెన్స్ చేయండి అక్కా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు బండ్ల గణేష్. ఏ పార్టీలో చేరినా చివరకు ఆ పార్టీల అధిష్ఠానాన్నో.. అధినేతలో తిట్టి బయటకు రావడం వారికి అలవాటు. ఉన్నన్నీ రోజులూ తియ్యా పెట్టకుండా ఉన్నట్టు ఉండే ఈ ఇద్దరూ ఏ మాత్రం ఆపార్టీలతో చెడిందా.. ఇక నోటికి పని చెప్పడమే వీరి పని. జీవిత-రాజశేఖర్ సినిమా పరిశ్రమకు చెందిన వారే అయినప్పటికీ.. బండ్ల గణేష్ ఈ విధంగా సోషల్ మీడియాలో చెలరేగడం చర్చగా మారింది. గత మా ఎన్నికల్లో జీవిత-రాజశేఖర్‌తోపాటు.. బండ్ల గణేష్ కూడా పోటీ చేయాలని నామినేషన్ వేశారు. ఆ తర్వాత గణేష్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఒకే పోస్టుకు ఇద్దరూ నామినేషన్ వేయడంతో తకరారు నడిచింది. టీవీ చర్చల్లో పరస్పరం ఈ ఇద్దరూ తీవ్ర విమర్శలు చేసుకున్నారు కూడా.
బండ్ల గణేష్ తాజా అస్త్రాలు చూశాక.. జీవితలపై ఆయన కోపం చల్లారలేదన్నట్టు ఉంది. ఏక కాలంలో టీఆర్ఎస్‌తోపాటు.. బండ్ల గణేష్ కూడా ఈ ఇద్దర్నీ ఓ ఆట ఆడుకోవడమూ ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలో పదునైన కామెంట్సే పెడుతున్నారు నెటిజన్లు. మరి.. ఈ ఎపిసోడ్‌కు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడతారో లేక సినిమా కథల్లో మలుపుల్లా అటూ ఇటూ తిప్పుతారో చూడాలి.