Off The Record: సొంత నియోజకవర్గానికి ఏదో చేద్దామని అమెరికా నుంచి వచ్చి గెలిచిన ఆ ఎమ్మెల్యేకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయా? ఇక్కడి రాజకీయ తత్వం అర్ధంగాక తొలి ఏడాదిలో తల బొప్పి కట్టిందా? స్థానిక కులాధిపత్య రాజకీయంలో ఎమ్మెల్యేని తొక్కే ప్రయత్నం జరుగుతోందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా శాసనసభ్యుడు?
Read Also: Off The Record: పొంగులేటిని బాంబుల శ్రీనివాస్ అని ట్రోల్ చేస్తున్నారా..? ఎందుకు..?
పార్టీ పెద్దలు ప్రాధాన్యత ఇస్తున్నా.. ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాత్రం పెద్దలుగా చెలామణి అవుతున్న వాళ్ళు మాత్రం చింతలపూడి ఎమ్మెల్యేను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారట. దాంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రోషన్ కుమార్… అసలు అమెరికా నుంచి ఎందుకుకొచ్చి ఈ రొచ్చులో దిగానని అనుకుంటున్నట్టు సమాచారం. వివాదాలకు అతీతంగా రాజకీయం చేద్దామనుకున్న ఎమ్మెల్యేకు ఇప్పుడు వర్గపోరు తలనొప్పితెచ్చిపెడుతోందన్నది లోకల్ టాక్. ఈ ఎన్నారై ఎమ్మెల్యే
అనుచరవర్గానికి చెబుతున్నదొకటి, వాస్తవం మరొకటి కావడంతో ఆయన మీదే విమర్శలు పెరుగుతున్నాయంటున్నారు. నియోజకవర్గ రాజకీయాల్లో పెద్దలుగా చెప్పుకునే కొంతమంది నేతలు తామే ఎమ్మెల్యేలమన్నట్టు వ్యవహరించడం, మట్టి దగ్గర నుంచి, మద్యం వరకు అన్ని వ్యవహారాల్లో వేలుపెట్టడంతో షాడోల గోల ఎక్కువైందని అంటున్నారు. అసలే ఎన్నారై.. ఆపై నియోజకవర్గానికి కొత్త.. దీంతో ఎమ్మెల్యే రోషన్‌కు తెలియకుండానే వ్యవహారాలన్ని చక్కబెట్టేస్తున్నారట లోకల్ పెద్దలు.
Read Also: PIB Fact Check: నో ‘ఫ్రీ స్యూటీలు’.. ఫ్యాక్ట్‌చెక్ షాకింగ్ పోస్ట్
దీంతో చింతలపూడి రాజకీయం అంటేనే చించేసిన విస్తరిలా మారిందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. వాస్తవానికి చింతలపూడిలో ఏ పార్టీ అధికారంలోఉన్నా…. కామన్‌గా కనిపించే వ్యవహారం వర్గపోరు. ఈ ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్‌లో ఇతర కులాల వాళ్ళు తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలోనే వర్గాలు తయారై విభేదాలు తలెత్తుతుంటాయి. అదే ఇప్పుడు విదేశాల నుంచి ఎగిరొచ్చిన ఎమ్మెల్యే రోషన్ కుమార్‌కు కూడా చుక్కలు చూపిస్తోందని అంటున్నారు. అసలే కొత్త. ఆపైన ఏదో చేద్దామని ఇక్కడికి వచ్చారు. వాలకం కొంచెం అప్‌డేటేడ్. దీంతో ఇతనితో మనకు సెట్ కాదనుకున్న మూస ధోరణి పెద్దలు కొందరు ఎమ్మెల్యే ఏంచేసినా పాపమే అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారట. నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్ అయినా…. ఇక్కడ రెడ్డి, కమ్మ, వెలమ సామాజికవర్గాల ప్రభావం ఎక్కువ. ఇప్పుడు అదే కామన్ ఇష్యూతో ఎమ్మెల్యే రోషన్ కుమార్‌కు తలనొప్పులు ఎక్కువైనట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉండేవారికి ప్రాధాన్యత కల్పిస్తుంటే…. పార్టీలో మేమే కీలకమని చెప్పుకు తిరిగే లీడర్లు తెగ ఫీలవుతున్నారట. ఇదే అదునుగా రోషన్ అనుచరవర్గంగా చెప్పుకుంటున్న కొందరు నియోజకవర్గంలో భారీ ఎత్తున వసూళ్ళకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Also: Off The Record: పూజారుల పొలిటికల్ టచ్అప్! జోగులాంబలో కాంగ్రెస్, బీఆర్ఎస్గా చీలికలు!
వైన్ షాపులు, మట్టి తవ్వకాలు, ఉద్యోగాల పేరుతో వసూళ్ళు జరుగుతున్నా… ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు స్థానికంగా. ఇదే ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఇటీవల పనితీరు మెరుగుపరుచుకోవాల్సిన శాసనసభ్యుల లిస్ట్‌లో చింతలపూడి పేరుండటంతో తలపట్టుకున్న ఎమ్మెల్యే… లోకల్‌గా అసలేం జరుగుతోందో ఓసారి చెక్ చేసుకుంటేగాని అసలు విషయం అర్ధంకాలేదట. ఇంతకాలం మనకెందుకులే అని వదిలేస్తే అది ఇప్పుడు తన కుర్చీ కిందికే నీళ్ళు తెస్తోందని గ్రహించి దిద్దుబాటు మొదలుపెట్టినట్టు సమాచారం. దీంతో చింతలపూడి పెద్దలకు ఇప్పుడు ఎటూ పాలుపోవడం లేదట. దీంతో కొత్త వ్యూహానికి పదును పెట్టి ఎమ్మెల్యేకి, మండల నేతలకు మధ్య చిచ్చుపెట్టే ప్రోగ్రాంలో బిజీగా ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరికీ గుర్తింపు ఇవ్వడంలేదని, నామినేటెడ్ పదవుల విషయంలోనూ అన్యాయం చేస్తున్నారన్నది వాళ్ళ సరికొత్త ప్రచారం. గుర్తింపు ఇస్తే దోచేయడం, పక్కనపెడితే తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న కొంత మంది నేతలు ఎమ్మెల్యేని గెలిపించామని ఇప్పుడు పార్టీ పెద్దల దగ్గర గోడు వెళ్ళబోసుకున్నా.. పెద్దగా ఫలితం లేదని సమాచారం. నియోజకవర్గంలో గ్రూపు పాలిటిక్స్ గురించి ఇప్పటికే విసిగిపోయిన అధిష్టానం చింతలపూడిని లైట్ తీసుకునే పరిస్థితికి వచ్చిందట. గడిచిన ఏడాది కాలంలో జరిగిన డ్యామేజ్‌ను ఇప్పుడు ఎమ్మెల్యే ఎలా కవర్ చేసుకుంటారన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్.