ఆ ఉమ్మడి జిల్లా అధికారపార్టీలో గ్రూపుల గోల ఎక్కువైందా? ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా స్వరాలు పెరుగుతున్నాయా? నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు రచ్చ రచ్చ అవుతున్నాయా? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్ వాచ్..!
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలుంటే అందులో సగానికిపైగా సెగ్మెంట్లలో టీఆర్ఎస్‌కు అసమ్మతి సెగ ఉంది. 2018 నుంచీ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ.. ఎన్నికలు సమీపించే కొద్దీ వేరు కుంపట్లు జోరందుకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యే వెంట తిరిగిన వాళ్లు ఇప్పుడు వైరిపక్షాలుగా మారిపోతున్నారు. చూస్తుండగానే వ్యతిరేక గ్రూపులు..రెండు.. మూడు, నాలుగు అని సంఖ్య పెరిగిపోతోంది. ముఠాలు కట్టి ఆగిపోకుండా.. జట్టుగా టీఆర్ఎస్ అధిష్ఠానం దగ్గరకు వెళ్లడం.. స్థానిక ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఇటీవల బోథ్, మంచిర్యాల, ఖానాపూర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాయకులు కొందరు హైదరాబాద్ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చారట. వీరిలో కొందరు రహస్యంగా భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. సోనాల మండలం కోసం బోథ్ నాయకులు హైదరాబాద్ వెళ్లారని చెబుతున్నా.. జడ్పీ ఛైర్మన్, మాజీ ఎంపీ, ఓ ఎంపీపీ ఆ శిబిరంలో ఉండటంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగానే వాళ్లంతా జట్టు కట్టారని అనుమానిస్తున్నారట. తమకు వ్యతిరేకంగా అధిష్ఠానానికి ఏం చెప్పారు? ఎలాంటి ఫిర్యాదులు చేశారో అని ఆరా తీస్తున్నట్టు సమాచారం.
బోథ్‌లో ఇటీవల పెన్షన్ కార్డుల పంపిణీ రచ్చ అయ్యింది. ఒకసారి ఇచ్చిన కార్డులను వెనక్కి తీసుకుని మరో నేత లబ్ధిదారులకు అందజేయడం దుమారం రేపింది. ఇక్కడ అసమ్మతి నేతల అడుగులు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్‌కు మింగుడు పడటం లేదట. అయితే అసమ్మతి వర్గానికి పార్టీలో ఎవరు వెన్నుదన్నుగా ఉన్నారు? ఎందుకు తనపై పగపట్టారో తెలియక ఆవేదన చెందుతున్నారట ఎమ్మెల్యే.
ఖానాపూర్‌లో పార్టీ నేత ఒకరు, ఓ మాజీ ఎంపీ, పొరుగు జిల్లా ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన మంత్రితో కలిసి పార్టీ పెద్దలతో మాట్లాడి వచ్చారట. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్ కోసమే పార్టీ పెద్దలతో సమావేశం అయినట్టు చెబుతున్నా.. దాల్ మే కుచ్ కాలాహై అని ఖానాపూర్ ఎమ్మెల్యే అనుమానిస్తున్నారట. మంచిర్యాలలో సైతం మాజీ ఎమ్మెల్యే ఒకరు ఇటీవల పార్టీ పెద్దలను కలిసి మాట్లాడి వచ్చారట. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో శాసనసభ ప్రాంగణంలోనే ఆయన హల్చల్ చేశారట. అసెంబ్లీ ప్రాంగణంలో మాజీని చూడగానే సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫ్యూజులు పోయినట్టు టాక్.
చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే ఓదెలు, జడ్పీ ఛైర్మన్ భాగ్యలక్ష్మి టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. ఇక్కడ బలమైన నాయకులు పార్టీకి దూరం కావడానికి ఎమ్మెల్యే వైఖరే కారణమని అనుమానిస్తున్నారట. ఓ మాజీ ఎమ్మెల్సీ సైతం తనకు పదవి రాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారట. మంచిర్యాల, ఆసిఫాబాద్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ గేర్ మార్చే పనిలో ఉన్నారు నాయకులు. లాభం లేదని భావించిన ఎమ్మెల్యేలు రివర్స్ అటాక్ మొదలు పెట్టినా.. రేపటిరోజున పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదట. ఏ శాసనసభ్యుడిని కదిపినా.. అసమ్మతి వర్గం ప్రస్తావన చేసినా ఉలిక్కి పడుతున్నట్టు చెబుతున్నారు. మరి.. గ్రూపు గులాబీలకు అధిష్ఠానం చెక్ పెడుతుందో లేదో చూడాలి.