Off The Record: ఆదిలాబాద్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ పొలిటికల్ స్టంట్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. రైల్ వోవర్ బ్రిడ్జి, రైల్ అండర్ బ్రిడ్జిలకు తాజాగా శంకుస్థాపనలు జరగడమే అందుకు కారణం. మూడేళ్ళ క్రితం మేం భూమి పూజ చేసిన వాటికి ఇప్పుడు బీజేపీ నాయకులు మళ్ళీ కొబ్బరికాయలు కొడుతున్నారంటూ… సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు గూలాబీ నాయకులు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్నది బీఆర్‌ఎస్ మాట.
ఆదిలాబాద్ టౌన్‌లోని ఎల్‌ఐసీ ఆఫీస్, ఆర్టీఓ కార్యాలయం ఏరియాతోపాటు తాంసి బస్టాండ్, పత్తి మార్కెట్‌కు వెళ్ళే దారిలో రైల్వే గేట్లు నిత్య నరకం చూపిస్తున్నాయి. గేటు పడితే ట్రాఫిక్ జాంతో పట్టణ వాసులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ కష్టాలకు చెక్ పెట్టే క్రమంలో… రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ,అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి 2023 మే4న భూమి పూజ చేశారు. నాటి బీజేపీ ఎంపీ సోయం బాపురావ్, ఆదిలాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న కలిసి ఎల్ ఐసీ ఆఫీస్ ఏరియాలో ఆర్ ఓబీ, ఆర్ యూబీ పనుల శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 97 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. సంజయ్ నగర్‌లోని ఓవర్ బ్రిడ్జి, తాంసి బస్టాండ్ ఏరియాలోని అండర్ బ్రిడ్జి నిర్మాణాలను 2024 కల్లా పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేశారు. ఓవర్ బ్రిడ్జి పనులు ఇప్పటికీ కొనసాగుతుండగా…. అండర్ బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ అడ్డుగా మారింది.
ఈ పరిస్థితుల్లో….తాజాగా బీజేపీ ఎంపీ నగేష్, అదే పార్టీ ఎమ్మెల్యే శంకర్ కలిసి తాంసి బస్టాండ్ ఏరియాలో భూమి పూజ చేశారు. దాంతో పొలిటికల్ కలర్ వచ్చేసింది. మున్సిపల్ ఎన్నికల కోసం జనాన్ని పక్కదారి పట్టించే విధంగా గిమ్మిక్కులు చేస్తున్నారంటూ గతంలోని వీడియోలను వైరల్ చేస్తున్నారు బీఆర్‌ఎస్ నాయకులు. అదే సమయంలో బీజేపీ వెర్షన్ వేరుగా ఉంది. గులాబీ నేతలు అనవరంగా ఆరోపణలు చేస్తున్నారని, నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ కాగా.. ఇప్పుడు మొత్తం నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని, అలాంటప్పుడు మేం భూమిపూజ చేస్తే తప్పేంటన్నది వాళ్ళ వాదన. ఇప్పుడు రాష్ట్రం వాటా నయా పైసా లేదని, వంద శాతం ఫండింగ్ కేంద్రమే చేస్తున్నప్పుడు ఆ మాత్రం క్రెడిట్ తీసుకోకూడదా అన్నది కమలం నాయకుల క్వశ్చన్.
ఇదిలా ఉండగానే తాజాగా భూమి పూజ సమయంలో ఏర్పాటు చేసిన సభా వేధికపైనే ఎంపీ నగేష్ మాట్లాడుతూ తాను వేరే పార్టీలో ఉన్నప్పుడు 2016-17 బడ్జెట్ లోనే ఆదిలాబాద్ రైల్వే ఓవర్ ,అండర్ బ్రిడ్జిలకు బడ్జెట్ కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. అంటే ఎప్పుడో బడ్జెట్ కేటాయించారు…నిధులు మంజూరు అయ్యాయి..2023 మే నెలలో నాటి ఎంపీ,ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఓవర్ బ్రిడ్జి పనులు సగం వరకు అయిపోయాయి. అలాంటప్పుడు మళ్లీ భూమి పూజ చేయడం ఎందుకనే ప్రశ్న ఆయన స్పీచ్ నుంచే వస్తోంది. ఇక దీనికి సంబంధించి సోషల్ మీడియా యుద్ధం గురించి అయితే చెప్పే పనేలేదు. మొత్తం మీద ఆదిలాబాద్ రైల్వే అండర్, వోవర్ బ్రిడ్జిల చుట్టూ… కావాల్సినంత రాజకీయం నడుస్తోంది. మీకు మరీ… అంతగా కొబ్బరి కాయలు కొట్టాలని ఉంటే… ఏ గుళ్ళోకో వెళ్ళి కొట్టుకోండి. పుణ్యమన్నా వస్తుంది. లేదా జనానికి ఉపయోగపడే ఇంకో ప్రాజెక్ట్ తీసుకొచ్చి కావాల్సినన్న కొట్టుకోండిగానీ… ఇలా… చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్లీ అన్నట్టు ఈ కోకోనట్ కొట్టుడు ప్రోగ్రామ్ ఏంటయ్యా బాబూ… అంటూ సెటైర్స్ వేస్తున్నారు స్థానికులు.
READ ALSO: BCCI vs BCB: BCCI తో గొడవ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొంప ముంచబోతుందా?