BCCI vs BCB: భారతదేశం – బంగ్లాదేశ్ మధ్య సంబంధాలలో ఉద్రిక్తత క్రమంగా పెరుగుతోంది. రాజకీయ, దౌత్య సంబంధాల పరంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంకా పూర్తి స్థాయిలో క్షీణించలేదు, కానీ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పటికే క్రికెట్ మైదానంలో తారాస్థాయికి చేరుకున్నాయి. IPL 2026 నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని BCCI తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం, బంగ్లా క్రికెట్ బోర్డు భారతదేశంపై తీవ్రంగా స్పందించాయి. కానీ బంగ్లాదేశ్ బోర్డు వైఖరి దాని స్వంత భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ నిర్ణయాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: HYD: సాహితీ ఇన్‌ఫ్రా స్కాంపై ఛార్జ్‌షీట్ దాఖలు
జనవరి 3న భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ హుస్సేన్‌ను తమ జట్టు నుంచి తొలగించాలని ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల హత్యల తర్వాత జరిగిన నిరసనలకు ప్రతిస్పందనగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వెళ్లడానికి నిరాకరించింది. ఐపీఎల్ ప్రసారాన్ని కూడా బంగ్లాలో నిషేధించింది. నిర్ణయాలు అయితే తీసుకుంది కానీ, వాటి పర్యావసనాలను అంచనా వేయలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వం, బంగ్లాదేశ్ బోర్డు BCCI తో వైరం కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని మర్చిపోతున్నాయి. వాస్తవానికి ఏ దేశ క్రికెట్ బోర్డు అయినా భారత జట్టు సందర్శించే ఈ సిరీస్ నుంచి ఎక్కువ సంపాదిస్తుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి సంపన్న క్రికెట్ బోర్డులు కూడా భారత జట్టు పర్యటన నుంచి గణనీయమైన లాభాలను పొందుతాయి. నిజానికి బంగ్లాదేశ్ వంటి చిన్న బోర్డుకు, భారత జట్టు పర్యటన చాలా లాభదాయకమైన ఒప్పందం. ఇప్పుడు BCCI భవిష్యత్తులో బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక క్రికెట్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకుంటే, దీంతో బంగ్లాదేశ్ బోర్డు కోట్లు సంపాదించే అవకాశాన్ని కోల్పోతుంది.
ద్వైపాక్షిక క్రికెట్ నిలిపివేయడం వల్ల బంగ్లాదేశ్ బోర్డు నష్టాలను చవిచూస్తుంది. అలాగే బంగ్లా క్రికెట్ బోర్డు తీసుకున్న రెండవ నిర్ణయం దాని క్రికెటర్లకు ఇబ్బందులను పెంచుతుంది. గతంలో కొంతమంది బంగ్లాదేశ్ ఆటగాళ్లను IPLలో ఆడటానికి అనుమతించారు. అయితే తాజా ఉద్రిక్తతల తర్వాత BCCI పాకిస్థాన్ క్రికెటర్ల మాదిరిగానే బంగ్లాదేశ్ ఆటగాళ్లపై కూడా పూర్తి స్థాయి నిషేధం విధించవచ్చని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇది బంగ్లాదేశ్ క్రికెటర్ల సంపాదన అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. ఇంకా విదేశీ క్రికెటర్లు తమ IPL ఆదాయంలో 10 శాతం తమ బోర్డుకు ఇవ్వాలి. తత్ఫలితంగా బంగ్లాదేశ్ బోర్డు ఆ డబ్బును కూడా వదులుకోవాల్సి వస్తుంది.
ఇది కేవలం IPL గురించి మాత్రమే కాదు. ప్రస్తుతం IPL యజమానులు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రధాన లీగ్‌లలో ఫ్రాంచైజీలను కూడా కలిగి ఉన్నారు. దక్షిణాఫ్రికా నుంచి యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, UAE వరకు, IPL యజమానులు వివిధ టీంలలో భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఇప్పుడు IPL జట్టు యజమానులు ఇంగ్లాండ్ “ది హండ్రెడ్”లోకి ప్రవేశించారు. అటువంటి పరిస్థితిలో BCCI ఈ ఫ్రాంచైజ్ యజమానులను విదేశీ లీగ్‌లలో తమ జట్లకు బంగ్లాదేశ్ ఆటగాళ్లను నియమించవద్దని అనధికారికంగా ఆదేశించవచ్చు. ఇప్పటికే IPL ఫ్రాంచైజ్ యజమానులు ఏ విదేశీ లీగ్‌లోనూ పాకిస్థాన్ ఆటగాళ్లను కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెటర్లకు కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తవచ్చు, ఇది వారి ఆదాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
దీంతో అదనంగా బంగ్లాదేశ్‌ను వ్యతిరేకించడానికి BCCI.. ICCలో తన పలుకుబడిని ఉపయోగించవచ్చనే అభిప్రాయకులు కూడా వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్ ప్రపంచ కప్ కోసం తన జట్టును భారతదేశానికి పంపడానికి నిరాకరించింది, అలాగే ICC తన మ్యాచ్‌లను తిరిగి షెడ్యూల్ చేయాలని అభ్యర్థించింది. ప్రస్తుతం భారత క్రికెట్ ICCలో బలమైన ప్రభావాన్ని కలిగి ఉంది. దీనికి ఛైర్మన్ జై షా, CEO సంజోగ్ గుప్తా ఇద్దరూ కూడా భారతీయులే. తత్ఫలితంగా BCCI తన పలుకుబడిని ఉపయోగించి ICCని తిరిగి షెడ్యూల్ చేయవద్దని ఒప్పించవచ్చు. దీని కారణంగా బంగ్లాదేశ్ T20 ప్రపంచ కప్‌లో తన స్థానాన్ని కోల్పోవచ్చు, లేదంటే BCB జరిమానా లేదా సస్పెన్షన్‌ను ఎదుర్కోవలసి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. అంతేకాకుండా ICC నుంచి వచ్చే వార్షిక నిధులు కూడా గణనీయంగా తగ్గవచ్చని చెబుతున్నారు. ఈ అన్నింటి కారణంగా బంగ్లా క్రికెట్ బోర్డుకు నిధులు లేకుంటే, అది టోర్నమెంట్లను సరిగ్గా నిర్వహించలేకపోతుంది. అంతేకాకుండా బీసీబీ తమ ఆటగాళ్లకు కూడా జీతాలు చెల్లించలేకపోయే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అలాగే అనేక కారణాలతో బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మొత్తానికి బీసీసీఐతో బంగ్లా క్రికెట్ బోర్డు వైరం అనేది అనేక విధాలుగా బీసీబీకే నష్టం అని స్పష్టంగా అర్థం అవుతుంది. చూడాలి మరి ఈ వైరాన్ని అలాగే కొనసాగిస్తారో లేదంటే సంధి చేసుకొని రాజీకి వస్తారో అనేది.
READ ALSO: Car Loan Planning: కార్ లోన్‌కు ప్లాన్ చేస్తున్నారా? మీ ప్రయాణం బాగుండాలంటే వీటిపై ఒక లుక్ వేయండి..