ఆ జిల్లా టీడీపీలో ఎప్పుడు ఏ గొడవ జరిగినా.. అధిష్ఠానం పేరుతో ఒక లెటర్ వస్తుంది. అందులో ఊరు పేరు.. మ్యాటర్ ఉంటుంది. ఎందుకు పంపిస్తున్నారు.. ఎవరికి పంపిస్తున్నారో వివరాలు కనిపించవు. కానీ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇంతకీ ఆ లేఖల ఆంతర్యం ఏంటి?
ఇప్పటికే అనంతలో జేసీ వర్సెస్ టీడీపీ పాత నేతలు..!
అనంతపురం జిల్లా టీడీపీలో కొన్నిరోజులుగా వర్గ విబేధాలు ఒక రేంజ్‌లో సాగుతున్నాయి. గతంలో నియోజకవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉండేది. ఇప్పుడు ఏకంగా ఒకరి నియోజకవర్గాలకు ఒకరు వెళ్లి సవాళ్లు చేసుకునేంత వరకు సమస్య వెళ్లింది. ఆ మధ్య అనంతపురంలో జరిగిన సీమ టీడీపీ నేతల సదస్సులో ఈ విభేదాలకు బీజం పడింది. కృష్ణజలాల పరిరక్షణ కోసం చేపట్టిన సదస్సులో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రచ్చ రేపారు. ఒకరిద్దరు నేతలు పార్టీని నాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు JC. మరుసటి రోజు పాత టీడీపీ నేతలంతా ఒక్కటై జేసీని మాటలతో ఉతికి ఆరేశారు.
అచ్చెన్నాయుడు పేరుతో లేఖ వైరల్..!
టీడీపీ నేతలకు కౌంటర్ ఇవ్వకుండా అనంతపురం, పుట్టపర్తి తదితర నియోజకవర్గాలకు వెళ్లి టీడీపీ నేతలను పరామర్శించారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. తమ నియోజకవర్గాల్లో జేసీ జోక్యం చేసుకుంటున్నారని అధిష్ఠానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ గొడవ పీక్‌కి చేరిన సమయంలో ఒక లేఖ వైరలైంది. తమ నియోజకవర్గాల్లో కాకుండా వేరే నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పార్టీ అనుమతి తీసుకోవాలని అచ్చెన్నాయుడు పేరుతో ఆ లేఖ వచ్చింది. ఈ ఆదేశాలను అతిక్రమిస్తే తమ దృష్టికి రావాలని కూడా అందులో ఉంది.
గొడవకు కారణం తెలిసినా అధిష్ఠానం వాటి జోలికి వెళ్లదా?
అసలే సీమ నేతలు. వారిని లేఖలు ఆపుతాయని అనుకోవడం భ్రమే. కాకపోతే ఎవరు ఎక్కడికి వెళ్లినా వెంటనే అచ్చెన్నాయుడు పేరుతో ఉన్న లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. జేసీ పర్యటనకు పోటీగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తాడిపత్రి వెళ్లారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరు ఎక్కడ పర్యటిస్తున్నారు? ఎందుకెళ్తున్నారు? గొడవకు కారణం ఎవరో తెలిసినా టీడీపీ అధిష్ఠానం వాటి జోలికి వెళ్లదు.
చేయి దాటిపోతుందని అనుకుంటున్న సమయంలో మాత్రం ఒక లేఖ పంపి చేతులు దులిపేసుకుంటున్నారట. ఏదీ నేరుగా చెప్పరు. అంతా డొంకతిరుగుడు వ్యవహారమే. దీనిపైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.
టీడీపీ వర్గాల్లో ఫన్నీగా మారిన లేఖ..!
మొదట్లో ఇలాంటి లేఖలను పార్టీలో అందరూ సీరియస్‌గా తీసుకునే వారు. కానీ సమస్య ఏదైనా ఒకే తరహా లేఖ సర్క్యులేట్ అవుతుండటంతో ఫన్నీగా మారిపోయింది. దాంతో లేఖను లైట్ తీసుకుంటున్నారట నాయకులు. ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో.. ఎవరిని బుజ్జగించాలో తెలియకుండా గాలిలో బాణాలు వేస్తే లాభం ఏంటన్నది కొందరి ప్రశ్న. ఇప్పటికే వర్గాలుగా విడిపోయిన నాయకులు.. అధిష్ఠానం నాన్చివేత ధోరణిని ఎవరికి అనుకూలంగా వారు మలుచుకుంటున్నారు. మరి.. రానున్న రోజుల్లో ఈ సమస్య ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.