Zaheer Khan Fab Four: ప్రస్తుత తరంలో అత్యుత్తమ టెస్టు క్రికెటర్లను ‘ఫ్యాబ్ 4’గా ఎంచుకుంటారన్నా విషయం తెలిసిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్స్ ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఈ ట్యాగ్ కేవలం బ్యాటర్లకేనా?.. బౌలర్లకు వర్తించదా? అనే అనుమానం చాలామంది అభిమానుల్లో ఉంది. తాజాగా టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేస్ విభాగంలో తన ఫ్యాబ్ 4ని ఎంచుకుని.. ఆ లోటును భర్తీ చేశాడు. దీంతో బౌలింగ్ విభాగంలో ఫ్యాబ్ 4 గురించి మరింత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఫ్యాబ్ 4లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, కగిసో రబాడ,హేజిల్ వుడ్‌లను జహీర్ ఖాన్ ఎంపిక చేశాడు. జహీర్ ఫ్యాబ్ 4లో ఇద్దరు భారత బౌలర్లు ఉండడం విశేషం. పాట్ కమిన్స్‌ను కూడా పోటీదారుగా పేర్కొన్నాడు. ‘గత కొన్నేళ్లుగా టెస్టుల్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు వెళ్లింది. ఏ పరిస్థితులలో అయినా భారత్ నిలకడగా రాణిస్తోంది. అందుకే తప్పకుండా నా ఫ్యాబ్ 4లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీని ఎంపిక చేస్తా. వీరి తర్వాత కగిసో రబాడ, జోష్ హేజిల్‌వుడ్ ఉంటారు. పాట్ కమిన్స్ కూడా ఫ్యాబ్ 4లో పోటీదారు. వీరందరూ టెస్టు క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నారు’ అని జహీర్ చెప్పాడు. ఇక నుంచి ఇతర దేశాల మాజీ క్రికెటర్లు సైతం అత్యుత్తమ బౌలర్లను ఎంపిక చేసే అవకాశముంది.