YV Subba Reddy: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. దీంతో, అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి పావులు కదుపుతోంది.. టార్గెట్ 2024.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నారు. 175 నియోజకవర్గాల్లో.. సర్వేలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళన చేపట్టారు. గెలిచే అవకాశం లేని నేతలను పక్కన పెట్టాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను రంగులో దింపుతున్నారు. 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. తొలి విడతలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, మేరుగ నాగార్జున, విడుదల రజిని నియోజకవర్గాల బాధ్యలు సైతం మారిపోయాయి.. అయితే, రానున్న రోజుల్లో వైసీపీలో ఇంకా చాలా మార్పులు ఉంటాయంటున్నారు వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి.
విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిపించుకోవాలన్నదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితుల దృష్ట్యా మార్పులు, చేర్పులు చేస్తున్నాం.. గాజువాక నియోజకవర్గంలో కూడా సమన్వయకర్తని మార్పు చేయాలని పార్టీ ఆదేశించింది. రెండు వారాల క్రితమే ఎమ్మెల్యే నాగిరెడ్డికి తెలియజేశామన్నారు. మాకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి కావాలని ఎమ్మెల్యే నాగిరెడ్డి, దెవాన్ రెడ్డి అన్నారు. మంచి అభ్యర్థికి సీటు ఇవ్వమని నాగిరెడ్డి సూచించారని తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో చాలా మార్పులు ఉండబోతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, నారా లోకేష్ 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.. కానీ, లోకేష్ పాదయాత్ర వలన ఎలాంటి వలసలు ఉండబోవని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.
కాగా, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే.. వైవీ సుబ్బారెడ్డితో సమావేశం అయ్యారు గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డి.. హైకమాండ్ నిర్ణయం వెనుక కారణాలు వారికి చెప్పి బుజ్జగించారు వైవీ. దీంతో, రాజీనామా విషయంలో దేవన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అసలు తాను రాజీనామా చేయలేదని అంటున్నాడు.. ఇక, నేను గాని, నా కుమారులు గానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులం.. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటామని ప్రకటించారు ఎమ్మెల్యే నాగిరెడ్డి. ఇక, దేవన్ రెడ్డి మాట్లాడుతూ నిన్న నేను నా వ్యక్తిగత పనులు మీద బయటకి వెళ్లాను, వెళ్లేముందు మా ఇంచార్జి సుబ్బారెడ్డితో మాట్లాడి వెళ్లాను, అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు. నిన్న నేను మళ్లీ సిటీకి వచ్చే లోపు నామీద చాలా పుకార్లు లేపారు. అయినా మా నాన్న ఎమ్మెల్యేగా ఉండగా నేనెందుకు పార్టీకి రాజీనామా చేస్తాను? నేను పార్టీతోనే వున్నాను అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని చెప్పి మా పెద్దలు సుబ్బారెడ్డి వివరణ ఇచ్చేందుకే నేను, మా నాన్న వచ్చాం. మేం ఎప్పటికి ముఖ్యమంత్రి జగన్ మాటకి, పార్టీకి కట్టుబడి ఉంటాం. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని పేర్కొన్నారు దేవన్ రెడ్డి.