ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టుల్లో విఫలమవుతున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో కోహ్లీ, రోహిత్‌లపై పలువురు టీమిండియా మాజీలు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీమ్ నుంచి తప్పుకుని యువకులకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వీరికి మద్దతుగా నిలిచారు. కోహ్లీ, రోహిత్‌లపై విమర్శలు సరికావని.. గతంలో వారు ఏం సాధించారో ఫాన్స్ మర్చిపోయారన్నారు. బాగా ఆడకపోతే కెప్టెన్ స్వయంగా జట్టు నుంచి తప్పుకోవడం గతంలో తానెప్పుడూ చూడలేదని యువీ పేర్కొన్నారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా స్టార్ ఆటగాళ్లకు యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమి కంటే న్యూజిలాండ్‌పై సిరీస్ కోల్పోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే.. స్వదేశంలో భారత్ 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. ఆస్ట్రేలియాలో గత రెండుసార్లు ట్రోఫీ గెలిచిన టీమిండియా.. ఈసారి ఓడింది. గొప్ప ప్లేయర్స్ అయిన కోహ్లీ, రోహిత్‌లపై విమర్శలు చేస్తున్నారు. చాలా చెడుగా మాట్లాడుతున్నారు. గతంలో ఇద్దరు ప్లేయర్స్ ఏం సాధించారో మర్చిపోయారు. ఈ కాలపు గొప్ప క్రికెటర్లలో కోహ్లీ, రోహిత్ ఉంటారు. వారిద్దరూ బాగా ఆడలేదు, భారత్ ఓడింది. అందుకు వారిద్దరూ మనకంటే ఎక్కువగా బాధపడుతున్నారు’ అని యువీ చెప్పారు.
Also Read: Vivo T3X Price Drop: భారీగా తగ్గిన ‘వివో టీ3ఎక్స్’ ధర.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
‘గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు మంచి క్రికెట్ మైండ్ ఉంది. భారత క్రికెట్ భవిష్యత్తును ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారికి తెలుసు. జట్టు విజయాల కోసమే అందరూ కష్టపడతారు. బాగా ఆడకపోతే ఓ కెప్టెన్ స్వయంగా జట్టు నుంచి తప్పుకోవడం నేనెప్పుడూ చూడలేదు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమని రోహిత్ భావించాడు. ఇది అతని గొప్పతనం. ఓడినా, గెలిచినా రోహిత్ గొప్ప కెప్టెన్. రోహిత్ సారథ్యంలో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ వరకు వెళ్లాం, 2024 టీ20 ప్రపంచకప్ గెలిచాం. ఇవే కాదు మరెన్నో విజయాలు సాధించాం. ప్లేయర్స్ రాణించనప్పుడు చెడుగా చెప్పడం సులభం కానీ.. వారికి మద్దతుగా నిలవడం చాలా కష్టం’ అని యువరాజ్ చెప్పుకొచ్చారు.