Vijayasai Reddy: జనసేనలో అనుభవం ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి వైసీపీలోకి రావడం హర్షణీయమని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి వైసీపీలోకి రావడాన్ని చూస్తే జనసేన ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలవాలనేది మా లక్ష్యమన్నారు. నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి రూ.1000 కోట్లు ఖర్చు.. నారాయణ రూ. 500 కోట్లు ఖర్చు పెడతారంట అంటూ ఆయన ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత విధంగా డబ్బుతో కూడిన రాజకీయాలను తీసుకువచ్చిన ఘనత టీడీపీ నేతలు.. చంద్రబాబుకే దక్కిందన్నారు. నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్న టీడీపీ నేతల్లో పలువురు వైసీపీకి చెందినవారేనన్నారు. నిన్ననే వందమంది వాలంటీర్లను టీడీపీలో నారాయణ చేర్చుకున్నారన్నారు. వారికి నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ వారి మనసు మాత్రం వైసీపీలో ఉందన్నారు.
Read Also: Amit Shah: రాహుల్ బాబా.. ఆర్టికల్ 370 రద్దై ఐదేళ్లు అవుతోంది..
అందుకే వాళ్ళు మళ్లీ వైసీపీలోకి వచ్చారన్నారు. టీడీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని.. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకోండి.. వైసీపీకి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామే కానీ ఎవరితోనూ జతకట్ట లేదన్నారు. బీజేపీ త్వరలో కామన్ సివిల్ కోడ్ తీసుకురానుందని.. మైనార్టీ లైన ముస్లిం.. క్రిస్టియన్లు దీనిపై ఆందోళన చెందుతున్నారన్నారు. దీనిపై టీడీపీ తన వైఖరిని ఇప్పుడే చెప్పాలన్నారు. చంద్రబాబు సమాధానం ఇవ్వకపోతే వాళ్లకు వ్యతిరేకంగానే పనిచేసినట్టుగానే భావించాలన్నారు. మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే పార్టీ టీడీపీ అని ఆయన ఆరోపించారు. ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఏకాభిప్రాయం తీసుకోవాలన్నారు. ఇదే విషయాన్ని జగన్ పలుమార్లు చెప్పారని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.