Thopudurthy Prakash Reddy: చంద్రబాబు రాయలసీమ పర్యటనపై రైతులు ఆందోళన చెందుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు వస్తే వర్షాలు రావన్న భయం రైతుల్లో ఉందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని ఆయన విమర్శలు గుప్పించారు. 45 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చి చంద్రబాబు ద్రోహం చేశారన్నారు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడేనని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఏం ముఖం పెట్టుకుని సీమ ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిదే అంటూ ఆయన వెల్లడించారు. వైఎస్సార్ కృషి వల్లే కృష్ణా జలాలు కరవు ప్రాంతాలకు చేరాయన్నారు.
Also Read: Hyderabad Metro: ఓల్డ్ సిటీలో కొన్ని కారణాలతో మెట్రో నిర్మాణం మరింత ఆలస్యం
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడే అంటూ ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. పోలవరం చంద్రబాబు ఏటీఎం అని సాక్షాత్తూ ప్రధాని మోడీ అన్నారని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామంటున్నారని.. ఆ డబ్బు కాంట్రాక్టర్లకు చంద్రబాబు దోచిపెట్టారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో పైసా ఖర్చు లేకుండా పేరూరు డ్యాంకు నీరిచ్చామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు అండ్ కో అవినీతికి పాల్పడిందన్నారు.