YSRCP: వైసీపీలో నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులు చేర్పులపై కసరత్తు జరుగుతూనే ఉంది. ఇప్పటికే నాలుగు లిస్ట్‌లను విడుదల చేసిన వైసీపీ అధిష్ఠానం ఐదో జాబితా కోసం కసరత్తు మొదలుపెట్టేసింది. నాలుగు లిస్టుల్లో ఊహించని వారి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐదో జాబితాపై వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఐదో లిస్ట్‌లో కొందరు ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు ఉండే అవకాశం ఉంది. ఐదో జాబితాపై కసరత్తు చేస్తున్న వైసీపీ అధిష్ఠానం కొందరు నేతలను క్యాంపు ఆఫీస్‌కు పిలిపించుకుంటోంది. దీంతో సీఎం క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు క్యూ కడుతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. అలాగే మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, బియ్యపు మధుసూధన్, కె. శ్రీనివాసులు కూడా సీఎం క్యాంపు ఆఫీస్‌కు వచ్చారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
Read Also: Konathala Ramakrishna: ఈ నెల 21న రాజకీయ ప్రయాణంపై నిర్ణయం ప్రకటిస్తా..
ఐదు లిస్ట్ కసరత్తు నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి నేతల తాకిడి తగ్గలేదు. ఉదయం నుంచి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్, అదీప్ రాజ్, సింహాద్రి రమేష్, అనంత వెంకట్రామిరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎస్.కోట ఎమ్మెల్యే కడిబండి శ్రీనివాసరావులు సీఎంఓకు వచ్చారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తికి టీడీపీలో చేరతారు అనే ప్రచారం నేపథ్యంలో కాసు మహేష్ సీఎంఓకు వచ్చినట్లు సమాచారం. క్యాంపు కార్యాలయానికి పేర్ని కృష్ణమూర్తి కూడా వచ్చారు. మచిలీపట్నం అసెంబ్లీ ఇంఛార్జ్‌గా పేర్ని కృష్ణ మూర్తిని ఇప్పటికే పార్టీ ప్రకటించింది.
ఇప్పటివరకు వచ్చిన లిస్టులలో 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీ స్థానాలను మార్చింది పార్టీ హైకమాండ్. దాదాపు 20 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో ఐదుగురు జడ్పీటీసీలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఐదో లిస్ట్‌లో ఇంకెంత మంది సీట్లు ఊడతాయోనని టెన్షన్ నెలకొంది.