తన పర్యటన సందర్భంగా నెల్లూరులో 2 వేల మంది పోలీసులు తిష్ట వేశారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వాళ్లంతా తన సెక్యూరిటీ కోసం కాదని, తన కోసం వచ్చే జనాల్ని అడ్డుకోవటానికిని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని, జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు అడుగులకు పోలీసులు మడుగులు ఒత్తుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకులు తమ పార్టీ వారిని కలవటం నేరమా?, ఎందుకు ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నించారు. తనను అభిమానించే వాళ్ల కోసం వస్తే తప్పేంటి? అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పర్యటనలో భాగంగా జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణితో జగన్ ములాఖత్ అయ్యారు. ఆపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన సాగుతోంది. జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం. సీఎం చంద్రబాబు అడుగులకు పోలీసులు మడుగులు ఒత్తుతున్నారు. రాజకీయ నాయకులు తమ పార్టీ వారిని కలవటం నేరమా?. ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు. నన్ను అభిమానించే వాళ్ల నా కోసం వస్తే తప్పేంటి?. నాకోసం వచ్చే వాళ్లను అడ్డుకోవటానికి ఏకంగా రోడ్లు తవ్వేశారు. ఒక ప్రతిపక్ష నేతను చూసి రోడ్లను కూడా తవ్విన చరిత్ర చంద్రబాబుకు దక్కుతుంది. 2 వేల మంది పోలీసులు ఇక్కడే తిష్ట వేశారు. వారంతా నా సెక్యూరిటీ కోసం కాదు.. జగన్ కోసం వచ్చే జనాల్ని అడ్డుకోవటానికి. చంద్రబాబు తన పాలన చూసి తనకే భయం వేస్తుంది. తన పాలన చూసి అందరూ మెచ్చుకోవాలిని ఏవేవో చేస్తున్నారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను వెన్నుపోటు పొడిచారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘జనాలకు ఒక్క పథకం కూడా అందటం లేదు. ప్రతీ ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. అన్నీ రంగాలను నిర్వీర్యం చేశారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. రైతులు వ్యవసాయం లేక ఆత్మహత్యలే శరణ్యం అనేలా ఉంది. రెడ్ బుక్ రాజ్యమేలుతుంది. ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజల గొంతును నొక్కే ప్రయత్నమే రెడ్ బుక్ రాజ్యాంగం. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న కుమార్ రెడ్డిపై ఇలాంటి దాడి గతంలో ఎప్పుడూ జరగలేదు. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు సాధారణం. ఏకంగా మనుషులను చంపటానికి ఇంటి మీద వచ్చారు. మద్యం సేవించి ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. ఆ సమయంలో 80 ఏళ్ల వాళ్ళ అమ్మను బెదిరించారు. ఆమె మహిళ కాదా. మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ప్రసన్న ఉంటే హత్య చేయటానికి కూడా వెనుకాడే వారు కాదు. నగరి మాజీ ఎమ్మెల్యే రోజాపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే నానా దుర్భాషాలు ఆడారు. మాజీమంత్రి రజనీపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తున్న పనులకు సిగ్గుతో తల వంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో స్టేట్‌మెంట్‌లు నచ్చకపోతే ఇళ్లకు వెళ్ళి చంపుతారా?’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.