సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఖండించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని మండిపడ్డారు. అరెస్ట్ నేపథ్యంలో పోసాని భార్య కుసుమలతను జగన్ ఫోన్‌లో పరామర్శించారు. అరెస్ట్ విషయంలో పోసానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని.. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు.
‘ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోంది. అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి. పోసానికి వైసీపీ పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తాం. పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులతో లీగల్ గా ముందుకు వెళ్తాం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ప్రస్తుతం పోసాని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఓబులవారిపల్లి పీహెచ్సీ డాక్టర్ గురు మహేష్ ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లు.. వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించినందుకు పోసానిపై కేసు ఫైల్ అయింది.