YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. తెలంగాణ హైకోర్టును మరోసారి ఆశ్రయించారు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.. ఈ ముందుస్తు బెయిల్ పిటిషన్ కు అనుమతించాలని అవినాష్‌రెడ్డి లాయర్ అభ్యర్థించారు.. అయితే, హైకోర్టులో ఉన్న అన్ని కేసుల వివరాలు తమ ముందు ఉంచాలని ధర్మాసనం పేర్కొంది.. మధ్యాహ్నం 2.30 గంటలకు అవినాష్ రెడ్డి పిటిషన్ విచారణకు అనుమతించే అవకాశం ఉంది.. అయితే, హైకోర్టులో పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉండగా.. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని.. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డిని విచారణకు సీబీఐ పిలిచిందని భాస్కర్ రెడ్డి తరపు లాయర్ పేర్కొన్నారు.
కాగా, వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ భాస్కరరెడ్డిని పులివెందులలో అరెస్ట్ చేసిన సీబీఐ ఆయన్ను హైదరాబాద్ తరలించింది. ఉస్మానియాలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం సీబీఐ జడ్జి నివాసంలో హాజరుపరిచారు. సీబీఐ అరెస్ట్ అక్రమమని భాస్కరరెడ్డి లాయర్లు వాదించారు. అయితే ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తని, బయటఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి… భాస్కరరెడ్డికి 14రోజుల రిమాండ్ విధించారు. ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తున్నారు భాస్కరరెడ్డి లాయర్లు.
మరోవైపు, వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరిని అప్రూవర్ గా మార్చడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ పై, ఇవాళ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఇదే కేసులో అరెస్టయిన ఉదయ్‌కుమార్‌రెడ్డి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారించనుంది సీబీఐ. ఇక, వైఎస్ వివేకా మర్డర్ కేసులో తన తప్పు లేదన్నారు అవినాష్‌రెడ్డి. కోర్టులపై నమ్మకం ఉందని చెప్పారు. కట్టుకథలతో జరిగే దర్యాప్తు నిలబడవన్నారు అవినాష్‌రెడ్డి. వివేకా హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో విచారణకు రావాలని ఆదేశించింది. దీనికోసం తెల్లవారుజామునే కడప నుంచి బయల్దేరిన ఎంపీ అవినాష్‌రెడ్డి.. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. కోటిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి.. ఓవైపు సీబీఐ విచారణ.. మరోవైపు హైకోర్టు విచారణ.. ఇలా వైఎస్ వివేకా హత్య కేసులో ఒకేరోజు కీలక పరిణామాలు చోటుచేసుకోవడంతో.. ఉత్కంఠగా మారింది.