విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పదవ తరగతి పరీక్ష ఫలితాలను వారం రోజుల్లోనే విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారని, రీ వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. గతంలో పరీక్షల విధానంలో చిన్న పొరపాట్లు జరిగాయని రామారావు పైన చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చి గాలి ముద్దుకృష్ణమ నాయడును రాజీనామా చేయించారని, ఇప్పుడు నీ కొడుకు (నారా లోకేష్)ను రాజీనామా చేయమని చెబుతారా? అని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెట్టారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో వెన్నుపోటు దినం ర్యాలీలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. బస్టాండ్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
‘విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. పదవ తరగతి పరీక్ష ఫలితాలను వారం రోజుల్లోనే విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారు. పదవ తరగతి రీ వాల్యుయేషన్‌లో అవకతవకలు జరిగాయి. గతంలో పరీక్షల విధానంలో చిన్న పొర్పాట్లు జరిగాయని రామారావు పైన చంద్రబాబు ఒత్తిడి తెచ్చి.. గాలి ముద్దుకృష్ణమ నాయడును రాజీనామా చేయించారు. ఇప్పుడు నీ కొడుకును రాజీనామా చేయమని చెబుతారా?. ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, విద్యాశాఖ మంత్రికి తలా ఒక హెలికాఫ్టర్, విమానం ఏర్పాటు చేసుకుని.. ప్రతిరోజు హైదరాబాదు-విజయవాడకు చక్కర్లు కొడుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ప్రజలకు ఏమాత్రం మంచి చేయాలని ఆలోచన వీరికి లేదు. ప్రజలను వంచించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది అయ్యింది. మోసపు హామీలతో ప్రజలను కూటమి నాయకులు వెన్నుపోటు పొడిచి నేటికి ఏడాది. ఈ ఏడాది కాలంలో లా అండ్ ఆర్డర్ దిగజారింది. 390 మంది హత్యకు గురయ్యారు. వైసీపీ నాయకులపై 2466 అక్రమ కేసులు బనాయించి 500 మందిని జైలుకు పంపారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెట్టారు. ఎన్నడు లేని విధంగా ఐపీఎస్ అధికారులపై కూడా కేసులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం ఆధారంగా నడుస్తుంది’ అని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు.
Also Read: Yuva Galam Book: యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంస!
‘అవినీతి విషయంలో ఇసుక, మద్యం, మైనింగ్ అంటూ అన్ని విధాలా దోచుకుంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక్క పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనసాగించలేని పరిస్థితి ఉంది. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయో కూటమి నాయకులకు తెలియాలి. రాష్ట్రంలో వేల కోట్లు అప్పులు చేస్తూ ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారు అనేది కూడా చెప్పలేకపోతున్నారు. దావోస్ పర్యటనకి వెళ్ళి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఒక్క పైసా పెట్టుబడి అయినా తెచ్చారా?. కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు లేకపోగా.. దాదాపు మూడు లక్షల ఉద్యోగాలు తొలగించారు. 2.60 లక్షల మంది వాలంటీర్లకు 10 వేలు రూపాయలు జీతం పెంచుతాం అన్నారు. అధికారంలో వచ్చిన వారానికే వారి ఉద్యోగాలు తొలగించారు. ఇక ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు అదే దుస్థితి. పీఆర్సీ, ఐఆర్, సీపీఎస్, మొదటి తారీకున జీతాలు ఏమయ్యాయి?’ అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.