Malladi Vishnu: రూ. 2వేల నోట్ల రద్దుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. రూ. 2 వేల నోట్ల రద్దు వల్ల తనకు గానీ, వైసీపీ పార్టీకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వైసీపీ పార్టీ పేదల పక్షమన్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం ద్వారానే మేం ఎన్నికల్లో గెలుస్తాం.. డబ్బులతో కాదని ఆయన అన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీని పరిచయం చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. ఎన్నికల్లో నోట్లతో గెలవాలనుకున్న చంద్రబాబుకే రూ. 2 వేల నోట్ల రద్దు వల్ల ఇబ్బంది అంటూ విమర్శించారు. చివరి నిమిషంలో రాజకీయాల్లోకి వచ్చి డబ్బుల పంపిణీతో రాజకీయం చేద్దామనుకునే వాళ్లకు కచ్చితంగా ఇబ్బంది ఉంటుందన్నారు.
పవన్ లాంటి సినిమా వాళ్ల దగ్గరే రూ. 2 వేల నోట్లు ఉంటాయన్నారు. గంటకు కోట్లాది రూపాయలు తీసుకునే పవన్ లాంటి సినిమా వాళ్ల దగ్గరే పెద్ద నోట్లు ఉంటాయని ఆరోపించారు. పేదలు స్వేదం చిందించి సంపాదించిన డబ్బు పవన్ వంటి వాళ్ల దగ్గరే ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్‌పై ఇష్టం వచ్చినట్టు క్యారికేచర్లు వేయడం సరికాదన్నారు. రాజకీయ నేతల దగ్గరే డబ్బులు ఉంటాయనే భావన కూడా సరైంది కాదన్నారు.