Tragedy : హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో దుర్ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా దొండపూడికి సెలవుల సందర్భంగా అత్తగారి ఇంటికి వెళ్లే క్రమంలో ఓ మహిళ రైలులో పడ్డారు. ప్రమాదవశాత్తు ట్రైన్ కిందపడి శ్వేత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన రైల్వే స్టేషన్ వారిని కన్నీరు పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. శ్వేత, ఆమె భర్త వెంకటేష్, ఇద్దరు పిల్లలతో కలిసి లింగంపల్లి నుంచి జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణం ప్రారంభించారు. వారి సీట్లు D-8 బోగీలో ఉండగా, పొరపాటున వారు D-3 బోగీలో ఎక్కారు. అక్కడి ప్రయాణికులు తమ సీట్లు కావని తెలియజేయడంతో, శ్వేత బోగీ మారాలని నిర్ణయించుకున్నారు.
IPL: ఐపీఎల్ చరిత్రలో.. సూపర్ ఫాస్ట్ సెంచరీ వీరులు
ట్రైన్ చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు, ఆమె ఇద్దరు పిల్లలు, లగేజీని D-8 బోగీలోకి చేర్చారు. ఆ సమయంలో ట్రైన్ కదలడం ప్రారంభించగా, తానే ఎక్కే ప్రయత్నంలో శ్వేత ట్రైన్ , ప్లాట్ఫామ్ మధ్య పడి రాటుదేలిపోయారు. ఈ దృశ్యాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయ్యి ట్రైన్ చైన్ లాగి ఆపేందుకు ప్రయత్నించినా, అప్పటికే ఆలస్యమైంది. శ్వేత ఘటనా స్థలంలోనే మరణించారు. కళ్లెదుట తల్లి మృతి చెందడం పిల్లలకు తట్టుకోలేని విషాదాన్ని మిగిల్చింది.
ఈ సంఘటనపై రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. బోగీ మారే సమయంలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ప్రయాణికులు తగిన సమయంలో మాత్రమే ట్రైన్ మారాలని, రద్దీ ఉన్న సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.