WI vs IND 2nd Test day 4 Highlights: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 255 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం దూకుడుగా ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 181/2 వద్ద డిక్లేర్ చేసి.. విండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు నాలుగో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి 76/2 స్కోరుతో నిలిచింది. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (24), జర్మన్ బ్లాక్‌వుడ్ (20) క్రీజులో ఉన్నారు. చివరి రోజు విండీస్ విజయానికి ఇంకా 289 పరుగులు అవసరం కాగా.. టీమిండియాకు 8 వికెట్స్ కావాలి.
ఓవర్‌నైట్ స్కోరు 229/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన విండీస్.. భారత బౌలర్ల ముందు తేలిపోయింది. 7.4 ఓవర్లలో 26 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (5/60) చెలరేగాడు. చివరి నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్ భరతం పట్టాడు. ఆరంభంలోనే ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అథనేజ్(37) ఎల్బీగా పెవిలియన్ చేరాడు. కొద్దిసేపటికే సీనియర్ ఆటగాడు జేసన్ హోల్డర్ (15)ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆపై అల్జారీ జోసెఫ్ (4), కీమర్ రోచ్ (4), షానోన్ గాబ్రియెల్ (0)లను పెవిలియన్‌కు పంపడంతో విండీస్ ఆలౌటైంది.
Also Read: Gold Price Today: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం రేటు ఎంత ఉందంటే?
భారీ ఆధిక్యం సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్‌లు రోహిత్ శర్మ (57; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (38; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. రోహిత్, జైస్వాల్ వెంటవెంటనే ఔట్ అయినా.. ఇషాన్ కిషన్ (52; 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ (29; 37 బంతుల్లో 1 ఫోర్) అతడికి సహకారం అందించాడు. ఇషాన్ అర్ధ సెంచరీ చేయగానే భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ సేన 438 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట వర్షం వల్ల కాసేపు ఆగిపోయింది.
భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (28; 52 బంతుల్లో 5 ఫోర్లు), త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. అయితే 18వ ఓవర్లో బ్రాత్‌వైట్‌ను ఔట్ చేసిన ఆర్ అశ్విన్ టీమిండియాకు ఆరంభం ఇచ్చాడు. ఆ మరుసటి ఓవర్లోనే కిర్క్ మెకంజీ (0)ని ఔట్ చేసి మరో బ్రేక్ ఇచ్చాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.
Also Read: KTR :కేటీఆర్ ‘AI’ ఫొటోస్.. ‘సూపర్ హీరో’ లుక్ లో అదరగొట్టేశాడుగా..