Rs 2,000 Notes: మామూలు జనం రూ.2వేల నోటు చూసి చాలా కాలమైంది. అసలు చూద్దామంటే ఒక్క నోటేలేదంటే కట్టలెక్కడుంటాయి. అంటే, సామాన్య జనం దగ్గర ఒక్క నోటూ లేదు. ఏటీఎంలలో రావటం మానేసి చాలా ఏళ్లైంది. యూపీఐ ట్రాన్సాక్షన్లకు జనం అలవాటు పడ్డారు. క్యాష్ అవసరమైతే వంద, ఐదొందలు నోట్లు వాడుతున్నారు. రూ.2వేల నోటు అప్పుడెప్పుడో 2016 తర్వాత కొద్ది రోజులు కనిపించి అలా మెరుపుతీగలా మాయమైంది. రూ.2వేల నోటు మార్కెట్‌లో చలామణిలో కనిపించటం లేదూ అంటే.. అసలు లేదని కాదు.. దేశంలో 3.62లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు మార్కెట్‌లో ఉన్నాయి. అవన్నీ జనం దగ్గరే ఉన్నాయి. కానీ, బయటకు రావటం లేదు. ఎవరో దాచేశారు. ఎక్కడో దాచేశారు. దేనికోసమో దాచేశారు. అదే ఇప్పుడు బ్యాన్ అయింది.
ఒకవేళ సామాన్య జనం దగ్గర ఐదు, పది రూ.2వేల నోట్లున్నా వాటిని మార్చుకోవటంలో ఎలాంటి కష్టం లేదు. వాళ్లకు ఎంత ఆదాయం వస్తుంది? ఆస్తులెంత? అప్పులెన్ని అన్నీ పద్ధతిగానే రికార్డయి ఉంటాయి కాబట్టి.. పాన్ కార్డ్, ఆధార్ లాంటి అనేకానేక గుర్తింపు కార్డులతో కెవైసీలు పూర్తయి ఉంటాయి కాబట్టి వాళ్లంతా నోట్లు మార్చుకోవటంలో పెద్ద కష్టం లేదు. బ్యాంకు దగ్గరకు ఒకటి రెండు సార్లు వెళ్లాలనేదొక్కటే కాస్త చిరాకు పెట్టే విషయం.
కానీ, అసలు విషయం ఇప్పుడా రూ.2వేల నోట్లు ఎక్కడున్నాయి అనే. నోటు రద్దు ఎఫెక్ట్ ఎవరిపై ఉంటుంది అనే. దేశంలో నూటికి 90మంది సామాన్యులే. అంటే నెలజీతంపై ఆధారపడి బతికేవాళ్ల నుండి రోజు వారి వేతనం తీసుకునే కార్మికుల వరకు.. వీళ్లెవరి దగ్గరా భారీ ఎత్తున రూ.2వేల నోట్లు పోగై ఉండే ఛాన్సు లేదు. ఐదు పది ఉన్నా చిక్కు లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర రూ.2 వేల కట్టలున్నాయో వాళ్లకే ఇప్పుడు సమస్య. వాళ్లంతా చట్ట ప్రకారం సంపాదించి దాచుకున్న సొమ్మైతే ఏ గొడవా లేదు. తగిన ఆధారాలు చూపిస్తే సరిపోతుంది. కానీ, లెక్కకు రాని సొమ్మై ఉంటే వాటిని చిత్తు కాగితాల్లో కలుపుకోవటం తప్ప చేయగలిగిందేం ఉండదు.
ఇప్పుడు ఆర్బీఐ మార్కెట్‌లో చలామణీలో ఉన్న రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు శుక్రవారం నాడు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, ఈ నోట్లను ఇప్పటికిప్పుడు పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టంచేసింది. సెప్టెంబర్ 30 వరకు 2 వేల నోటు చెల్లుతుంది. సో, ఎవరి దగ్గరైనా రూ.2వేల నోట్లు ఉంటే, మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం ఇచ్చింది ఆర్బీఐ. దీనికోసం కొన్ని నియమ నిబంధనలను కూడా ప్రకటించింది. ఇవన్నీ స్పష్టంగానే ఉన్నాయి. ఒక విడతలో పది 2 వేల నోట్లు మార్చుకోవచ్చని తెలిపింది. డిపాజిట్ చేయటానికి మాత్రం ఎలాంటి నిబంధనలు లేవు. కానీ, ఇక్కడే అసలు సమస్య ఉంది. డిపాజిట్ చేయటానికి నిబంధనలు లేకున్నా, పెద్ద మొత్తంలో నోట్లు కట్టలు కట్టలు తెచ్చి ఎవరైనా డిపాజిట్ చేయబోతే …ఎవరు చేశారు? వాళ్లకా సొమ్ము ఎక్కడి నుండి వచ్చింది? లాంటి వివరాలన్నీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. 2వేల నోటు రద్దులో ఇబ్బంది పడేది ఇలాంటి వాళ్లే..
2016 నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు కారణంగా నగదు కొరత రాకుండా, వీలైనంత త్వరగా క్యాష్ మార్కెట్‌లో రావటం కోసం 2 వేల నోటు తెచ్చామని ఆర్బీఐ చెప్పిది. అయితే ఈ నోటు ప్రింటింగ్ 2018-19లోనే నిలిపివేసింది. 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న నగదు మొత్తంలో రూ.2వేల నోట్ల వాటా 89 శాతంగా ఉంది. 2018 మార్చి 31 నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. 2023 మార్చి నాటికి ఆ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. అంటే చలామణీలో ఉన్న మొత్తం నగదులో రూ.2వేల నోట్ల వాటా 10.8 శాతానికి చేరింది. మొత్తం కరెన్సీలో 10శాతం పైగా ఉన్న రూ.2వేల నోట్లు అడ్రస్ లేవు. అవన్నీ ఎవరి దగ్గరున్నాయి? ఎక్కడున్నాయి? ఇవన్నీ ఇప్పుడు తేలబోతున్న అంశాలు. నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటికి రానున్నాయి. ఒకవేళ బయటపెట్టి లేనిపోని చిక్కుల్లో పడటం ఎందుకు అనుకుంటే ఆ సొమ్ముని వదులకుని నష్టపోక తప్పదు.
గత డిసెంబర్ నాటికి దేశంలో చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువ 32.5లక్షల కోట్లు. ఇప్పుడు చలామణీలో ఉన్న నోట్లలో ఐదొందల వాటానే ఎక్కువ. మొత్తం కరెన్సీలో 34.9శాతం ఐదొందల నోటు. పది రూపాయల నోట్ల వాటా 21.3 శాతం ఉంది. ఆరున్నరేళ్ల క్రితం ఎవరూ ఊహించనట్టుగా నోట్ల రద్దు జరిగింది. అంతే అనూహ్యంగా రూ.2వేల నోటు ఎంటరైంది. అతి తక్కువ కాలంలోనే కనుమరుగైపోతోంది. అయితే 2016లో నోట్ల రద్దు తర్వాత దేశంలో కనిపించిన దృశ్యాలేవీ ఇప్పుడు కనిపించటం లేదు. ఆ రోజు ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు గంటల తరబడి పడిగాపులు కాశారు జనం. క్యూలైన్లలోనే చనిపోయిన వాళ్లున్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్లపై ఆధారపడిన అనేక రంగాలు కుప్పకూలాయి. పరిస్థితి సాధారణంగా మారటానికి చాలా ఏళ్లు పట్టింది. అయితే ఇప్పుడు 2వేల నోటు రద్దవుతోంది అన్న తర్వాత పట్టించుకున్నవాళ్లు కనిపించటం లేదు. జనంలో ఎలాంటి ఉలికిపాటూ లేదు. దీనికి కారణం ఎవరి దగ్గరా నోట్లు పెద్దగా లేకపోవటమే. సామాన్య జనం దగ్గర రూ.2వేల నోట్లు లేవు సరే.. ఎవరి దగ్గరున్నాయి అనే అసలు ప్రశ్న మిగిలే ఉంది.