జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ….. సినిమా కార్మికులు ఎటు వైపు..? గట్టిగా ప్రభావితం చూపే ఈ వర్గం ఏ పార్టీ వైపు చూస్తోంది? అధికార పార్టీ ఇచ్చిన హామీల్ని నమ్ముతున్నారా? లేక విపక్షాల వైపు చూస్తున్నారా? అసలు ప్రభుత్వం వాళ్ళకు ఏమేం హామీలిచ్చింది? ఆ గ్రూప్ ఓట్ బ్యాంక్ సాలిడ్ అవుతుందా? లేక చీలికలుంటాయా?
Also Read:Bigg Boss 9 : సుమన్ శెట్టికే జై కొడుతున్న బిగ్ బాస్ ఫ్యాన్స్.. కప్ కొట్టేస్తాడా..?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అత్యంత ప్రభావవంతమైన వర్గాల్లో సినీ కార్మికులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏ అభ్యర్థి గెలవాలన్నా వాళ్ళ మద్దతు కూడా కీలకమే. సాధారణంగా వాళ్ళ ఓట్లలో పెద్దగా చీలికలు రావు. యూనియన్ నిర్ణయమో లేక వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడంమో…. కారణం ఏదైనాగానీ… వీలైనంత వరకు అంతా ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళ అవసరాలు కూడా అందర్నీ ఒక్క తాటి మీదికి తీసుకువస్తుంటాయి. దీంతో ఇప్పుడు సినీ కార్మికులు ఎటువైపు ఉన్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల సినీ కార్మికులు సమ్మె నిర్వహించి తమ సమస్యల పరిష్కారం దిశగా ఇండస్ట్రీ పెద్దల మీద వత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. దాంతో… సీఎం రేవంత్ రెడ్డి రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు.
సినిమా ఇండస్ట్రీకి నిర్మాతలు ఎంత ముఖ్యమో… కార్మికులు కూడా అంతే ముఖ్యమంటూ ఇరువైపులా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి. అలాగే… ప్రభుత్వం తరఫున కూడా కార్మికులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నారాయన. అందులో భాగంగానే ఇటీవల సినీ కార్మికులకు కొన్ని హామీలిచ్చారు. కొత్త సినిమా విడుదలైందంటే చాలు…. టికెట్ ధర పెంపుకోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తుంటారు నిర్మాతలు. ఇక్కడే నిర్మాతలకు, కార్మికులకు ఒక లింక్ పెట్టి ఆ వర్గాన్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు సీఎం. కొత్త సినిమాల టిక్కెట్ ధరల పెంపునకు ఓకే చెబుతూనే… అలా పెంచిన ధరలో 20 శాతం కార్మికులకు ఫండ్‌గా ఇవ్వాలని షరతు విధించారు. అలా ఒప్పుకున్న సినిమాలకే టికెట్ల ధర పెంపునకు తమ ప్రభుత్వం అనుమతి ఇస్తుందని క్లియర్‌గా, క్లారిటీగా చెప్పేయడంతో… సినీ కార్మిక వర్గం హ్యాపీగా ఉందట. దీన్ని గొప్ప ఊరటనిచ్చే అంశంగా వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దీనికి తోడు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వ నుంచి పది కోట్లు ఇవ్వాలని కూడా నిర్ణయించామన్నారు ముఖ్యమంత్రి. అలాగే…. ప్రభుత్వం తరుపున సినీ కార్మికులకు ఐదు లక్షల డెత్ ఇన్సూరెన్స్, పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం, సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్, ఆఫీస్లకు స్థలం, ఫ్యూచర్ సిటీలో ఇళ్ళ స్థలాల్లాంటి కార్మికులకు కాన్ఫిడెన్స్ ఇచ్చే రకరకాల ప్రకటనలు చేశారాయన. రేపు డిసెంబర్లో ప్రజా పాలన వారోత్సవాలను నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. అప్పటి లోపు సినిమా కార్మికులకు ఇచ్చిన హామీలపై మరింత స్పష్టతతో పాటు కార్యాచరణను కూడా తీసుకోవాలని భావిస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్‌కంటే ముందే సినిమా కార్మికులకు కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేయగా… ఇప్పుడిక అమలు ప్రయత్నాల్లో ఉన్నారట.
ఆ విధంగా… సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపుతున్న క్రమంలో….. ఈ వర్గం ఓటు బ్యాంకు ఎటు వైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తమకు భరోసా ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి వారు భరోసా ఇస్తారా? లేక వేరే ఆలోచన చేస్తారా అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో. మరీ ముఖ్యంగా కార్మికుల పిల్లలకు స్పెషల్ స్కూల్ మీద ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆ వర్గాలను దగ్గర చేసే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించింది. ఫైనల్‌గా రేపు పోలింగ్ బూత్‌లో ఎవరి మైండ్ సెట్ ఎలా మారుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.