నేడు గుంటూరులో కేంద్ర పౌర విమానాయ శాఖమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. హిందూ ఫార్మసీ కళాశాలలో వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులతో కేంద్రమంత్రి సమావేశం కానున్నారు.
నేడు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిల పాల్గొననున్నారు.
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. నేటి సాయంత్రం తిరిగి నిందితులను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో రెండోరోజు కొనసాగనుంది. నేడు సదస్సులో విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే, తమిళ నాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, సాయి బాబా సంస్థాన్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సురేష్ హవారే, గోవా పర్యాటక మంత్రి రోహన్, ఇస్కాన్ కమ్యునికేషన్స్ డైరెక్టర్ గోవింద దాస్ పాల్గొనున్నారు.
నేడు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వైస్ చైర్మన్ కోసం వైసీపీ, టీడీపీ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నిక వాయిదా పడింది.
నేడు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లకు నిరసనగా బంద్ ప్రకటించారు.
నేడు వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.
ఈరోజు ఉదయం 11:30 గంటలకు సచివాలయంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రంజాన్ నెల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జరగనుంది.
నేడు, రేపు రాజస్థాన్ ఉదయ్ పూర్‌లో వాటర్ విజన్ 2047 సదస్సు జరగనుంది. తెలంగాణాలో గ్రామీణ మంచినీటి సరఫరాపై మంత్రి సీతక్క ప్రసంగించనున్నారు.
డబ్ల్యూపీఎల్-3లో భాగంగా నేడు గుజరాత్ జెయింట్స్ ఉమెన్, ముంబై ఇండియన్స్ ఉమెన్ మధ్య మ్యాచ్ జరగనుంది. వడోదరలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది.