Parliament Building: రేపటి(మంగళవారం) నుంచి పార్లమెంట్ కార్యకలాపాలు కొత్త భవనానికి మారనున్నాయి. పాత పార్లమెంట్ భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంతో సహా కొన్ని చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభం కాగా.. కొత్త పార్లమెంట్ భవనం మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం పాత పార్లమెంట్ భవనంలో చివరి ప్రసంగం చేశారు. ఈ భవనం గొప్ప చరిత్రను ప్రసంగంలో ప్రస్తావించారు. ఇది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. చంద్రయాన్-3 మిషన్, G20 ప్రెసిడెన్సీ వంటి భారతదేశం ఇటీవలి విజయాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీ హైలైట్ చేశారు.
కొత్త పార్లమెంట్ భవనంలో రేపటి నుంచి సమావేశాలు జరగనున్న తరుణంలో పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేయనున్నారనే సందేహాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కూల్చేస్తారా అంటూ చాలా మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంత మంది పాత పార్లమెంట్ భవనం విశిష్టత గురించి చర్చించుకుంటున్నారు. 1927లో పూర్తయిన పార్లమెంట్ భవనం 96 సంవత్సరాలు సేవలందించింది. ఎన్నో చారిత్రక నిర్ణయాలకు సాక్ష్యంగా నిలిచింది. ఎన్నో చట్టాలు ఈ భవనంలో రూపొందాయి. ఇదిలా ఉండగా.. ఏళ్ల తరబడి నేటి అవసరాలకు సరిపోవడం లేదని తేలింది.
Also Read: Union Cabinet: సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ.. కీలక బిల్లులకు ఆమోదం!
ఈరోజు లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఎంపీలు కొత్త ఆశ, విశ్వాసంతో కొత్త భవనంలోకి ప్రవేశిస్తారని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. స్వాతంత్ర్యం తరువాత, ఇది సంసద్ భవన్, భారత పార్లమెంటుగా మారింది. ఈ భవనాన్ని నిర్మించాలని బ్రిటీష్ పాలకులు నిర్ణయం తీసుకున్నారనేది నిజమే, అయితే దీన్ని కట్టడానికి పడిన చెమట, శ్రమ, డబ్బు మన భారత దేశవాసులదేనని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆ నిజాన్ని గర్వంగా చెప్పుకోవాలని ప్రధాని పేర్కొన్నారు.
Also Read: PM Modi: పార్లమెంట్‌లో నెహ్రూను కొనియాడిన ప్రధాని.. స్పందించని సోనియా, కాంగ్రెస్ నేతలు
పాత భవనం కూల్చివేయరు..
బ్రిటీష్ వాస్తుశిల్పులు సర్ ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్ రూపొందించిన దిగ్గజ పార్లమెంట్ భవనం స్వాతంత్ర్య పోరాటానికి మాత్రమే కాకుండా, ఆ తర్వాత దేశం ఎదుగుదలకు కూడా సాక్ష్యంగా నిలిచింది. భవనాన్ని కూల్చివేయడం లేదని, పార్లమెంటరీ కార్యక్రమాల కోసం మరిన్ని క్రియాత్మక స్థలాలను అందించడానికి తిరిగి అమర్చబడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశపు పురావస్తు సంపద అయినందున చారిత్రక కట్టడం పరిరక్షించబడుతుందని వర్గాలు తెలిపాయి. 2021లో అప్పటి కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్యసభలో ప్రస్తుత నిర్మాణాన్ని మరమ్మత్తు చేసి, ప్రత్యామ్నాయ ఉపయోగం కోసం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. హెరిటేజ్-సెన్సిటివ్ పునరుద్ధరణ కోసం జాతీయ ఆర్కైవ్‌లను కొత్త పార్లమెంట్ భవనానికి మార్చనున్నట్లు వారు తెలిపారు. పాత భవనంలో కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చవచ్చని కూడా కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
కొత్త భవనం
కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ ఏడాది మేలో ప్రధాని ప్రారంభించారు. ఈ భారీ భవనం లోక్‌సభ ఛాంబర్‌లో 888 మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్‌లో 300 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్‌లో వసతి కల్పించారు. త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. దీనికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి – జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్.. వీఐపీలు, ఎంపీలు, సందర్శకులకు ప్రత్యేక ప్రవేశాలు ఉన్నాయి.