తిరుమల శ్రీవారి వైకుంఠద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో నిన్న జరిగిన తోపులాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో ఆరుగురు భక్తులు చనిపోయారు.మరికొందరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు… అసలు ఏ సమయానికి ఏం జరిగింది. ఎలా జరిగింది… రెప్పపాటులో అంత ఘోరం ఎలా జరిగిపోయింది. ఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం..
తిరుపతి నగరంలో దాదాపు 90కౌంటర్లు ఏర్పాటు..
ఏటా వైకుంఠ ద్వార దర్శన సమయంలో లక్షలాది మంది తిరుమలకు తరలి వస్తారు. భక్తులు రోజుల తరబడి క్యూలలో నిలబడి ఉండాల్సి వస్తుండటంతో టోకెన్ల జారీ విధానానికి శ్రీకారం చుట్టారు. తిరుపతి నగరంలో దాదాపు 90కౌంటర్లను ఏర్పాటు చేశారు. టైమ్ స్లాట్ టోకెన్లు ఉన్న భక్తుల్ని మాత్రమే దర్శనానికి వైకుంఠ ద్వార దర్శనాల కోసం అనుమతి ఇస్తారని వార్తలు వెలువడటంతో భక్తులు పెద్ద ఎత్తన తరలి వచ్చారు. తిరుపతిలోని పది ప్రాంతాల్లో టైమ్ స్లాట్ దర్శనం టోకెన్లు జారీ చేస్తారని సమాచారం అందింది. తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ తో పాటు రామానాయుడు హైస్కూల్ , రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, తిరుపతి, ఎమ్మార్‌పల్లి హైస్కూల్ తిరుపతి, తిరుపతి, ఇందిరా మైదానం, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
పద్మావతి పార్కులోకి పంపిన పోలీసులు…
బైరాగిపల్లె రామానాయుడు స్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రంలో గతంలో స్థానికులకు మాత్రమే టోకెన్లు జారీ చేసేవారు. ఈ ప్రాంతంలో ఉన్న కేంద్ర గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ చాలా తక్కవ మంది ఉంటారని అందరూ ఇక్కఈ సారి ముందే ప్రచారం చేయడంతో బుధవారం తెల్ల వారు జామునే వేలాది ముందు పాఠశాల వద్దకు చేరుకున్నారు. బుధవారం ఉదయం క్యూలైన్లలోకి జనాన్ని అనుమతించక పోవడంతో పోలీసులు వారందరిని పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపారు. సాయంత్రానికి అక్కడ పదివేలమంది వరకు పోగయ్యారు. భక్తుల్ని పార్కులోకి ఉంచేసి గేట్లను మూసేయడంతో లోపల ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. బుధవారం రాత్రి 7.30-8 గంటల ప్రాంతంలో ఓ మహిళ అస్వస్థతకు గురైంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడింది. తమను బయటకు పంపాలని కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైన మహిళను బయటకు తీసుకు వచ్చేందుకు గేట్లను తెరిచారు. ఆ సమయంలో భక్తులను పోలీసులు అప్రమత్తం చేయలేదు. పార్కు లోపల ఉన్న వారికి గేట్లు ఎందుకు తెరుస్తున్నారో తెలియక టోకెన్ల కోసం క్యూ లైన్లలోకి పంపుతున్నారని భావించారు.
ఆరుగురు భక్తులు మృతి…
పార్క్ గేటు నుంచి క్యూ లైన్లలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా జనం తోసుకు వెళ్లారు. పద్మావతి పార్కులో వాకింగ్ ట్రాక్ నిర్మించి ఉంది. ట్రాక్‌కు కింద ఉన్న లాన్‌కు అడుగున్నర ఎత్తు తేడా ఉంది. ట్రాక్ మీదుగా గేటు బయటకు రావాల్సి ఉంటుంది. గేటు వైపుకు వచ్చే క్రమంలో లాన్ నుంచి పైకి ఎక్కే క్రమంలో కొందరు కిందపడిపోయారు. జనం తోసుకుంటూ వారి మీదుగా వెళ్లిపోయారు. ఆ సమయంలో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. దాదాపు 15నిమిషాల పాటు తీవ్ర తొక్కిసలాట తర్వాత కింద పడిన వారిని అతికష్టమ్మీద బయటకు తీసుకు రాగలిగారు. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. మరో 40కి పైగా క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
బాధితులను పరామర్శించిన మంత్రులు..
కాగా… “ప్రాథమిక చికిత్స అనంతరం కొందరిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి చికిత్స జరుగుతోంది.” అని ఈవో శ్యామల రావు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంత్రులు అనిత.. ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్ రుయా ఆసుపత్రిలోని మార్చరీ వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులను కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు వారికి వివరించారు. బాధితులను మంత్రులు పరామర్శించారు. కుటుంబీకులను కోల్పోయిన బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా..
తాజాగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. అంబులెన్సులలో మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు ఓ అధికారిని కూడా పంపుతున్నారు. కాగా.. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మంత్రులు అనిత.. ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్ రుయా ఆసుపత్రిలోని మార్చరీ వద్దకు చేరుకున్నారు. రుయా ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. కలెక్టర్, ఎస్పీ ఘటన అంశాన్ని మంత్రులకు వివరించారు. మరోవైపు.. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.