Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?

West Asia Crisis

West Asia Crisis

Crude Oil Prices: పశ్చిమ ఆసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే దిశగా సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాకు ఆటంకాలు కలగవచ్చనే ఆందోళనల మధ్య, భారత్ తన విదేశీ మార్పిడి నిల్వలను కాపాడుకోవడానికి ఇప్పటికే బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ ప్రాంతంలో అనిశ్చితి నెలకొనడం వల్ల క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన అవసరాల కోసం 85 శాతం దిగుమతులపైనే ఆధారపడే భారత్‌కు ఇది పెను సవాలుగా మారింది.

ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా స్పందిస్తూ.. ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్స్, ఈవీ వాహనాల వాడకం, సాధ్యమైన చోట స్కూళ్లకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయాలని సూచించారు. మరోవైపు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతిరోజూ దాదాపు రూ.1,000 కోట్ల మేర నష్టాలను చవిచూస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరుకున్నా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు చేయకపోవడమే ఇందుకు కారణం. ఈ భారీ నష్టాలను చమురు సంస్థలు ఎంతో కాలం భరించలేవని, త్వరలోనే పెట్రో ధరల పెంపు తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ పరిస్థితిని ఒక “వేక్-అప్ కాల్” (మేల్కొలుపు పిలుపు)గా అభివర్ణించారు. దేశంలో ప్రస్తుతం ఇంధన నిల్వలకు కొరత లేనప్పటికీ, భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లకు ప్రజలు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ సైతం ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కొనసాగితే భారత్ ఒక “పెద్ద షాక్” ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, ఇది రూపాయి విలువ పతనం, ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు సైతం ఆటోమేటిక్‌గా పెరుగుతాయని, ఈ గ్లోబల్ సంక్షోభం భారత సామాన్యుడి జేబుపై గట్టి ప్రభావం చూపనుందని స్పష్టమవుతోంది.