India vs Pakistan: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము సపోర్టు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. అయితే, చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితిని ఇరు దేశాలే నిర్ణయించుకోవాలని విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పుకొచ్చారు. ప్రాంతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా, పాక్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా అందులో ఉన్నాయన్నారు. ఈ మేరకు పాక్ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని మిల్లర్ పేర్కొన్నారు.
Read Also: Rukh Khan Mansion: అమెరికాలో షారుఖ్ ఖాన్ మాన్షన్.. ఒక రాత్రికి 2 లక్షలు!
కాగా, పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే విధానాన్ని వీడాలని ఇండియా పదే పదే దాయాది దేశం పాక్‌కు చెప్పుకొస్తుంది. ఈ సమస్యను అధిగమించిన తర్వాతే ఇరు దేశాల మధ్య చర్చలు, సత్సంబంధాలకు బాటలు పడతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారతదేశ భద్రతకు ముప్పు తలపెట్టే కుటిల ప్రయత్నాలను అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు. ఇలా ఓవైపు హింసను ప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలకు పిలిస్తే తాము అంగీకరించేది లేదని ఇప్పటికే భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని వీడే వరకు చర్చలకు తావు లేదని వెల్లడించింది.