Team India Head Coach Rahul Dravid React on India Batting Depth: వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 2-3 తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. లాడర్‌హిల్‌లో ఆదివారం రాత్రి జరిగిన చివరిదైన ఐదో టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. భారత్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 18 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విండీస్ చేతిలో ఓడిపోవడం భారత్‌కు ఇదే తొలిసారి. ఐదో టీ20 మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సిరీస్ ఓటమిపై స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌పై కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్నాడు.
అక్షర్ పటేల్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఆ తర్వాత యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్ లాంటి టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తారు. టెయిలెండర్లందరికి పెద్దగా బ్యాటింగ్ రాదు. మరోవైపు విండీస్ తరఫున చివరి స్థానంలో వచ్చే అల్జారీ జోసెఫ్ కూడా సిక్స్‌లు కొట్టగలడు. ఇదే విషయంపై రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడాడు. టీ20 ఫార్మాట్‌లో బ్యాటింగ్ ఆర్డర్ సమస్య ఉందని, లోతైన కసరత్తు అవసరం అని పేర్కొన్నాడు.
Also Read: Tilak Varma: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. రెండో ఆటగాడిగా అరుదైన రికార్డు!
‘వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ద్వారా బ్యాటింగ్ లైనప్‌పై మరింత దృష్టి పెట్టాలని తెలిసింది. కొన్ని అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సిరీస్ ద్వారా ఎక్కడ మెరుగుపడాలనేది తెలుసుకోగలిగాం. లోతైన బ్యాటింగ్ విషయంలో మరిన్ని ప్రయత్నాలు చేయాలి. ఇక మా బౌలింగ్ మరీ బలహీనంగా ఏం లేదు. భవిష్యత్తులోనూ మ్యాచ్‌లు ఉంటాయి. భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. అయితే లోతైన బ్యాటింగ్‌తో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. విండీస్ జట్టులో అల్జారీ జోసెఫ్ చివరి స్థానంలో వచ్చి కూడా భారీ షాట్లు ఆడతాడు. మనకు అలాంటి వాళ్లు అవసరం. తప్పకుండా బ్యాటింగ్ లైనప్‌పై వర్కౌట్ చేస్తాం’ అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.