Warangal: ప్రియురాలి జల్సాల కోసం చైన్ స్నాచర్‌గా మారాడు ప్రియుడు. ఈ ఘటన వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం, దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి కాలనీలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. గత ఏడాది కాలంగా వరుస చైన్ స్నాచింగ్‌లతో కలకలం సృష్టించాడు. పది మంది మహిళల మెడలోంచి పుస్తేల తాళ్లు తెంచుకుపోయాడు. అతడి దగ్గర నుంచి 237 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దొంగతనానికి ఉపయోగించిన బైక్స్ సైతం చోరీ చేసినవేనని పోలీసులు గుర్తించారు. మూడు దొంగిలించిన బైక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన హరీష్ ఓ సిమెంట్ కంపెనీలో క్వాలిటీ టెక్నిషన్‌గా హైదరాబాద్‌లో పనిచేశాడు. ఇదే క్రమంలో మొదటగా ఈ ఏడాది ఇదే సిమెంట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సహోఉద్యోగి ఇంటిలో బంగారు గొలుసు చోరీకి పాల్పడ్డడు. దానిని స్థానిక మణిప్పురం గోల్డ్ లోన్ కంపెనీలో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేశాడు. తరువాత తన లవర్ కోసం స్నాచింగ్‌లు మొదలు పెట్టాడు. ఈ మధ్య ఈ వరుస చైన్ స్నాచింగ్‌లపై అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్, హన్మకొండ ఏసిపిల అధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడుని గుర్తించి పక్కా సమచారంతో ఈ రోజు ఉదయం పోలీసులు ఉదయం యాదవ్‌నగర్ క్రాస్ రోడ్డు వద్ద కెయూసి, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న సమయంలో పట్టుకున్నారన్నారు. పోలీసులు పట్టుకొని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు గొలుసును గుర్తించారు. అదుపులో తీసుకొని విచారించగా కథ మొత్తం బయటపడింది.