Vishnu Kumar Raju: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో యర్రగొండపాలెంలోని మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఇద్దరికి, చంద్రబాబుకు సెక్యూరిటీ అధికారికి గాయాలైనట్టు చెబుతున్నారు.. ఇక, మంత్రి ఆదిమూలపు సురేష్.. తన టీ షర్ట్ విప్పిన విషయం విదితమే.. అయితే.. దీనిపై స్పందించిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. మీరు బట్టలు విప్పడం కాదు., 2024లో ప్రజలే మీ బట్టలు విప్పి పరిస్థితి వస్తుందంటూ హెచ్చరించారు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ పై రాళ్లదాడి చేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్న ఆయన.. మంత్రి హోదాలో బట్టలు విప్పి సవాల్ విసరడం సిగ్గుచేటు అన్నారు.. మీరు బట్టలు విప్పడం కాదు., 2024లో ప్రజలే మీ బట్టలు విప్పి పరిస్థితి వస్తుందంటూ సెటైర్లు వేశారు.
ఇక, 2024లో నూటికి నూరు శాతం వైసీపీ ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు విష్ణుకుమార్ రాజు.. సీఎం మెప్పు పొందడానికే మంత్రులు ఇలా ప్రవర్తిస్తున్నారన్న ఆయన.. ఈరోజు మంత్రి షర్ట్ విప్పితే, రేపు ఇంకో మంత్రి ప్యాంటు విప్పుతాడు, మరోసారి ఇంకో మంత్రి బట్టలన్నీ విప్పుతాడు.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకోపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు.. మరోవైపు.. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందో చెప్పాలంటే నేనే ఉదాహరణ.. ఎందుకంటే.. ఒకప్పుడు రోలెక్స్ వాచి వాడేవాడిని.. ఇప్పుడు నార్మల్ వాచి స్థాయికి దిగిపోయాను అంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై స్పందిస్తూ.. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్తే వైసీపీ మూసుకోవడం బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్ రాజు.. సుప్రీం కోర్ట్ అద్భుతమైన తీర్పు ఇచ్చిందన్న ఆయన.. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయం అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి కేసులో అసలు సూత్రధారులు బయటకు రాలేదు.. కలుగులో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. ఇక, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేకంగా మెసేజ్‌లు పెడితే అరెస్టులు చేస్తారా? అని నిలదీశారు. సీఎం చిన్నానను చంపే ధైర్యం, దమ్ము ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించిన ఆయన.. న్యాయం గెలుస్తుంది.. సునీతమ్మ కి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని పేర్కొన్నారు విష్ణుకుమార్ రాజు.