ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు కొందరు వ్యక్తులు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తమోడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రతపై విశాఖ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు పోలీసులు. నగరంలో పలు పెట్రోల్ బంకుల్లో నో హెల్మెట్ – నో పెట్రోల్ బోర్డులు ఏర్పాటు చేశారు. నగరవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ సరఫరా ఉండదని హెచ్చరికలు జారీ చేశారు. నో హెల్మెట్ – నో పెట్రోల్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని పోలీసులు వెల్లడించారు.