విశాఖ డ్రగ్స్ రవాణా పంచాయతీ ఈసీకి చేరింది. విశాఖ డ్రగ్స్ రవాణాకు.. తమకు లింకులున్నాయన్న టీడీపీ ఆరోపణలపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. టీడీపీ దుష్ప్రచారం చేస్తోందంటూ వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆధారాల్లేని ఆరోపణలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మరోవైపు.. చంద్రబాబు, పురంధేశ్వరి సన్నిహితులకే డ్రగ్స్ రవాణతో సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తుంది. డ్రగ్స్ రవాణా విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది. సీబీఐ చెప్పిన అంశాల ఆధారంగానే తాము ఆరోపణలు చేస్తున్నట్లు టీడీపీ చెబుతుంది. అంతేకాకుండా.. తమ ఆరోపణలకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందని తెలుపుతుంది. వైసీపీ నేతలే డ్రగ్స్ రవాణాలో కీలక పాత్ర పోషించారని టీడీపీ ఆరోపిస్తుంది. మరోవైపు.. చంద్రబాబు చేసిన ట్వీటులో తమ వద్దనున్న ఎవిడెన్సును కూడా జత చేశామని టీడీపీ చెబుతుంది.
‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా డ్రై ఈస్ట్‌తో మిక్స్ చేసిన దాదాపు 25వేల కేజీల డ్రగ్స్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ను కలిగి ఉన్న షిప్పింగ్ కంటైనర్‌ను అదుపులోకి తీసుకుని.. మొత్తం సరుకును సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. “ఆపరేషన్ గరుడ”లో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో వ్యవస్థీకృత డ్రగ్స్ కార్టెల్స్‌పై పోరాటంలో భాగంగా ఇంటర్‌పోల్ ద్వారా అందిన సమాచారంతో విశాఖ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ సహాయంతో విశాఖపట్నం ఓడరేవులోని షిప్పింగ్ కంటైనర్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. విశాఖ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డీల్ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విశాఖ పోర్టులో పట్టుబడ్డ 25 వేల కేజీల కొకైన్, మాదకద్రవ్యాలపై ఆరా తీయనున్నారు. వేల కోట్ల రూపాయల డ్రగ్ రాకెట్ ను ఇంటర్‌పోల్ గుర్తించడంతో.. ఆపరేషన్ ‘గరుడ’లో భాగంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.