Viral News Of Gst bills in Shopping Malls: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీఎస్టీ చర్చనీయాంశంగా మారింది. నిత్యావసరాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ విధించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చివరకు పాలు, పెరుగు మీద కూడా జీఎస్టీ విధించడమేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్యాక్ చేసిన అన్ని తృణధాన్యాలు, బియ్యం, గోధుమ పిండి, పెరుగు, పాలు వంటి ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 శాతం జీఎస్టీ విధించింది. దీంతో ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు అల్లాడిపోతుండగా ఇప్పుడు ఈ జీఎస్టీ పోటు మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించటం కొత్తేమీ కాదని.. కానీ వీటిపై తొలిసారిగా పన్ను విధిస్తున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Read Also: Viral Video Of Girl Crying: ఫన్నీ వీడియో.. అట్లుంటది ఈ పిల్లతోని
సాధారణంగా షాపింగ్ మాళ్లలో ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలే ఎక్కువగా లభిస్తాయి. దీంతో జీఎస్టీ భారం తడిచి మోపెడు అవుతోంది. అయితే రూ.వెయ్యి లోపు షాపింగ్ చేస్తే జీరో పర్సంట్ జీఎస్టీ అని.. 1000-1500 లోపు బిల్లు చేస్తే 2.5 శాతం జీఎస్టీ అని.. రూ.1500-రూ.2500 మధ్య బిల్లు చేస్తే రూ.6 శాతం జీఎస్టీ అని.. రూ.2,500-రూ.4,500 మధ్య బిల్లు చేస్తే 18 శాతం జీఎస్టీ అని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ విస్తృతంగా వైరల్ అవుతోంది. ఒకవేళ సామాన్యులు బిగ్ బజార్, డీమార్ట్, స్పెన్సర్స్, రత్నదీప్, మోర్ వంటి షాపింగ్ మాళ్లలో జీఎస్టీ నుంచి తప్పించుకోవాలంటే మీ బిల్లును రూ.1000గా విడివిడిగా పొందాలని.. అప్పుడు ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని ఓ పోస్ట్ ద్వారా కొందరు వైరల్ చేస్తున్నారు. ఉదాహరణకు మీరు రూ.5వేలు బిల్లు చేస్తే 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. అదే బిల్లును రూ.వెయ్యిగా ఐదు బిల్లులను విడివిడిగా పొందితే ఎలాంటి జీఎస్టీ కట్టాల్సిన అవసరం లేదని సదరు పోస్టు ద్వారా వివరిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.