Vijayasai Reddy: నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జన సేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. 2009లో నెల్లూరు లోక్‌సభ స్థానం జనరల్ కేటగిరికి కేటాయించారని.. సొంత ప్రాంతం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తనకున్న అనుభవంతో నెల్లూరు లోక్ సభ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో పిఠాపురం టీడీపీ నేతల భేటీ.. సీటుపైనే చర్చ!
టీడీపీకి నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థి లేక మా పార్టీ నుంచి తీసుకున్నారు.. ఇది దివాళాకోరుతనం కాదా అంటూ విజయసాయి ప్రశ్నించారు. మా పార్టీ ద్వారా అన్నీ పొంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి, ఇతర నేతలు నైతిక విలువలు పక్కన పెట్టి మాట్లాడుతున్నారన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆ మాటలు ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయన్నారు. విశాఖ పోర్ట్‌కు మాదక ద్రవ్యాలు కలిగిన కంటైనర్ వస్తే దానిని వైసీపీకి ఆపాదించారని.. సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. మాదక ద్రవ్యాల దిగుమతిపై సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నేతను అభినందిస్తూ ట్వీట్ పెట్టాను.. దీంతో తనకు ఆపాదిస్తున్నారని విజయసాయి చెప్పుకొచ్చారు. బ్రెజిల్‌తో మన దేశానికి సత్సంబంధాలు ఉన్నాయన్నారు.
Read Also: Mylavaram Politics: మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు
ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీ.. అందుకే దానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు అవసరమైతే పొత్తు పెట్టుకుంటాడు…లేకుంటే తిడతాడంటూ తీవ్రంగా విమర్శించారు విజయసాయి రెడ్డి. బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆరు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. అనైతిక యుద్దాన్ని ప్రారంభించింది టీడీపీనేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కొందరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్నారు.