Mylavaram Politics: మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమాను కలుస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించారు. టీడీపీ కేడర్‌ను మొత్తాన్ని కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. బొమ్మసాని సుబ్బారావు కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు తాను టీడీపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టించలేదని పేర్కొన్నారు. కొండపల్లిలో మాత్రం అనుకోకుండా ఒకసారి అలా జరిగిన మాట వాస్తవమే.. అందులోనూ తన ప్రమేయం లేదన్నారు. తన పేరు ప్రకటించాక కూడా ఉమా ర్యాలీ చేయడంపై అది తనపై ఆయన వ్యతిరేకిస్తున్నట్లుగా చూడనన్న వసంత.. త్వరలోనే దేవినేని ఉమా మహేశ్వరరావును కూడా కలుస్తానన్నారు. ఆయన కూడా కలిసి వస్తారని ఆశిస్తున్నానన్నారు.
Read Also: Andhra Pradesh: వైసీపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే
ఇదిలా ఉండగా.. టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావును ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కలిశారు. తనకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. తాను మైలవరం టీడీపీ టికెట్ ఆశించిన మాట వాస్తవమేనని ఆ పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ముందే చెప్పానని.. ఆ ప్రకారం వసంత కృష్ణ ప్రసాద్ విజయానికి కృషి చేస్తానని బొమ్మసాని హామీ ఇచ్చారు. మరి దేవినేని ఉమా.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి పని చేస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.