ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ (72) అనారోగ్యంతో మరణించారు. సోమవారం ఉదయం మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఉదయం 11 గంటల ప్రాంతంలో మరణించారని చెప్పారు. పంకజ్ ఉదాస్ మరణవార్తను చాలా బరువెక్కిన హృదయంతో మీకు తెలియజేసేందుకు చింతిస్తున్నామని ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ ఓ ప్రకటనను పోస్ట్ చేశారు. ఆయన మృతితో అభిమానుల్లో, కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. పంకజ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతను 1951 మే 17న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని చర్ఖాడి-జైత్‌పూర్ గ్రామంలో జన్మించాడు. కాగా.. పంకజ్ ఉదాస్‌ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
పంకజ్ ఉదాస్ మరణ వార్త విని చాలా మంది షాక్ కు గురయ్యారు. ఆయన మృతిపై గాయకుడు సోనూ నిగమ్ స్పందించాడు. సోనూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు. “నా బాల్యంలో చాలా ముఖ్యమైన భాగం ఈ రోజు కోల్పోయింది. శ్రీ పంకజ్ ఉదాస్ జీ నువ్వు ఇక లేవని తెలిసి నా గుండె రోదిస్తున్నది. ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు.