ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసేసి తండ్రి అదృశ్యమైన ఘటనతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం వెంటూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తండ్రి పిల్లి రాజు గ్రామంలో రెండు కోట్ల రూపాయలు మేరకు అప్పులు కావడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక అదృశ్యం అయ్యాడు. పిల్లలు సందీప్, కారుణ్యలను రామచంద్రపురం మండలం తొగరువారి సావరం కాలువలో తోసివేసి.. ఆపై అదృశ్యమయ్యాడు. బాలుడు ఎలాగోలా ఒడ్డుకు చేరినా.. ఏడేళ్ల కారుణ్య ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని చూసి తల్లి విజయ శోకంలో మునిగిపోయారు. ఆర్థిక సమస్యలుంటే పరిష్కార మార్గాలు ఉంటాయని.. ఇలా చిన్నారులను తండ్రే ప్రాణాలు తీయాలనుకోవడం పట్ల వెంటూరు గ్రామంలో ఆవేదన వ్యక్తమవుతోంది.
చెల్లెలు, తనను స్కూలు నుండి తీసుకుని వెళ్లి చనిపోదామని తండ్రి రాజు చెప్పాడని అంటున్నాడు ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన కుమారుడు సందీప్. మొదట తనను, తర్వాత చెల్లిని కాలువలోకి తోసివేశాడని చెబుతున్నాడు. తాను కాలువలో ఊస పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డానని, చెల్లి కాలువలో మునిగిపోయి చనిపోయిందని చెప్పాడు. ఒక వ్యక్తిని లిఫ్ట్ అడిగి ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో విషయం చెప్పినట్లు సందీప్ తెలిపాడు.
గ్రామస్తుల నుండి రెండు కోట్ల రూపాయలకు అప్పులు చేసి.. తీర్చలేక ఆర్థిక ఇబ్బందులతో పిల్లి రాజు అదృశ్యం అయ్యాడని గ్రామస్తులు వాపోతున్నారు. కుమార్తెను చంపివేయటం దారుణమని ఆవేదన చెందుతున్నారు. కూలి నాళీ చేసుకుంటూ కష్టపడిన సొమ్ములు దాచుకుంటే.. ఫైనాన్స్ వ్యాపారి రాజు ఈ విధంగా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో అదృశ్యమైన ఫైనాన్స్ వ్యాపారి పిల్లి రాజు ఏమైపోయాడనేది మిస్టరీగా మారింది. గ్రామస్తులు నుండి అప్పులు తీసుకున్న రెండు కోట్ల రూపాయలు రాజు ఏం చేశాడు?, రాజు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడనే ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ద్రాక్షారామం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన పిల్లి రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.